యాక్సిస్ బ్యాంక్ సొంతమైన సిటీ బ్యాంక్!

by Disha Web Desk 17 |
యాక్సిస్ బ్యాంక్ సొంతమైన సిటీ బ్యాంక్!
X

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ సిటీ బ్యాంకు రిటైల్ వ్యాపారాన్ని దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసినట్టు సిటీ గ్రూప్ బుధవారం ప్రకటించింది. ఈ ఒప్పందాన్ని 1.6 బిలియన్ డాలర్ల(రూ. 12 వేల కోట్ల)కు పైగా వెచ్చించి యాక్సిస్ బ్యాంక్ సొంతం చేసుకుంది. సిటీ బ్యాంక్ రిటైల్ వ్యాపార విభాగంలో క్రెడిట్‌ కార్డులు, రిటైల్‌ బ్యాంకింగ్‌ సహా గృహ రుణాలు, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ లాంటివి ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సిటీ బ్యాంక్‌కు 35 శాఖలు ఉండగా, వినియోగదారు బ్యాంకింగ్‌ విభాగంలో దాదాపు 4,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరూ ప్రతిపాదిత లావాదేవీ పూర్తయిన తర్వాత యాక్సిస్ బ్యాంకుకు బదిలీ చేయబడతారని సిటీ గ్రూప్ వెల్లడించింది. ఈ ప్రకటన ఉద్యోగులకు సానుకూలంగా ఉంటుందని, కంపెనీ ప్రాధాన్యత ఉద్యోగుల భవిష్యత్తుకు తగిన భద్రత కల్పించామని సిటీ ఇండియా సీఈఓ అషు ఖుల్లార్ అన్నారు.

2021, మార్చి చివరి నాటికి దేశీయంగా సిటీ బ్యాంక్ రూ. 68,747 కోట్ల విలువైన రుణాలను కస్టమర్లకు ఇచ్చింది. అలాగే, మొత్తం రూ. 1.66 లక్షల కోట్ల విలువైన డిపాజిట్లను కలిగి ఉంది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. సిటీ బ్యాంకు భారత్‌లో జారీ చేసిన మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య 25.5 లక్షలుగా ఉన్నాయి. గ్లోబల్ స్ట్రాటజీలో భాగంగా భారత్‌తో పాటు మొత్తం 13 దేశాల్లో రిటైల్ బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌ నుంచి నిష్క్రమించనున్నట్టు గతేడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో సిటీ గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, సిటీ గ్రూప్ సంస్థ 1902లో భారత్‌లోకి ప్రవేశించింది. 1985లో రిటైల్ బ్యాంకింగ్ వ్యాపారాన్ని ప్రారంభించింది.

Next Story

Most Viewed