మైదానంలో పోరాట వీరుడు.. బయట సామాన్యుడు అక్షర్ పటేల్

by Malleboina Mahesh |

అక్షర్ పటేల్ సింప్లిసిటీ: భారీ ఊరేగింపు వద్దని అకాడమీ పిల్లలతో ముచ్చటించిన టీమిండియా వైస్ కెప్టెన్! అహ్మదాబాద్ కంటే నడియాడ్ పైనే మక్కువ ఎక్కువ.

మైదానంలో పోరాట వీరుడు.. బయట సామాన్యుడు అక్షర్ పటేల్
X

దిశ, వెబ్ డెస్క్: భారత క్రికెట్ జట్టులో కీలక పాత్ర పోషిస్తున్న అక్షర్ పటేల్ (Axar Patel) ప్రస్తుతం వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్నారు. 2024 టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన తర్వాత అక్షర్ పటేల్ తన సొంత జిల్లా ఖేడా లో జరిగిన ఓ ఘటన తాజాగా వైరల్ అవుతుంది. వరల్డ్ కప్ విజయం తర్వాత ఆయన తన జిల్లాకు చేరుకున్నప్పుడు ఒక అరుదైన దృశ్యం కనిపించింది. అక్షర్ అద్భుత ప్రదర్శనకు ముగ్ధులైన ఖేడా జిల్లా క్రికెట్ అసోసియేషన్, నడియాడ్ వీధుల్లో సుమారు 40 వేల మందితో భారీ ఊరేగింపు నిర్వహించాలని ప్లాన్ చేసింది. అయితే ఈ హడావుడి ఇష్టం లేని అక్షర్, అసలు ఇంటికే రాకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. చివరకు అసోసియేషన్ ప్రెసిడెంట్ మనీష్ దేశాయ్ వ్యక్తిగతంగా అభ్యర్థించడంతో.. కేవలం అకాడమీ పిల్లలతో చిన్నపాటి సమావేశానికి మాత్రమే అక్షర్ అంగీకరించారు. ఆడంబరాలకు దూరంగా ఉంటూ, గంటల తరబడి పిల్లలతో ముచ్చటించి వారి సందేహాలను తీర్చి అక్షర్ తన వినమ్రతను చాటుకున్నారు.

సాధారణంగా సెలబ్రిటీ హోదా వచ్చాక చాలామంది మెట్రో నగరాలకు మారిపోతుంటారు. కానీ అక్షర్ పటేల్ మాత్రం ఇందుకు భిన్నం. అహ్మదాబాద్ వంటి నగరాల్లో మెరుగైన అవకాశాలు ఉన్నప్పటికీ, ఆయన మాత్రం తన గుండె చప్పుడు 'నడియాడ్' అని గట్టిగా నమ్ముతారు. అహ్మదాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన చిన్ననాటి స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఉండటానికే ఆయన ప్రాధాన్యత ఇస్తారు. బుధవారం నాడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌లో అక్షర్ భారత జట్టు వైస్ కెప్టెన్‌గా బరిలోకి దిగుతున్నారు. ఇది ఆయనకు హోమ్ గ్రౌండ్ అని అందరూ అంటున్నప్పటికీ, అక్షర్ దృష్టిలో మాత్రం తన అసలైన ఇల్లు నడియాడ్ మాత్రమే.

మైదానంలో బంతితో, బ్యాట్‌తో భారత్‌కు ఎన్నో కీలక విజయాలు అందిస్తున్నా.. బయట ప్రపంచంలో అక్షర్ ప్రొఫైల్ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. తన లక్ష్యాల గురించి గొప్పలు చెప్పుకోకుండా, పని చేసి చూపించడమే ఆయన శైలి. టీమిండియా ప్లాన్స్‌లో అత్యంత కీలకమైన ఆటగాడిగా ఎదిగినా, ఆ స్టార్‌డమ్ తలకెక్కించుకోకుండా సామాన్యుడిలా జీవించడమే అక్షర్ పటేల్ ప్రత్యేకతగా నిలిచింది. కాగా ఈ రోజు జరిగే మ్యాచులో అక్షర్ పటేల్ ఎటువంటి ప్రదర్శన కనబరుస్తాడోనని తన హోమ్ టౌన్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Next Story