ఆడి కారు బీభత్సం: ఒకరి మృతి, 16 మందికి గాయాలు

by Malleboina Mahesh |

అదుపుతప్పిన ఆడి కారు రోడ్డు పక్కన ఉన్న వారి పైకి దూసుకెళ్లడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ఆడి కారు బీభత్సం: ఒకరి మృతి, 16 మందికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: అదుపుతప్పిన ఆడి కారు రోడ్డు పక్కన ఉన్న వారి పైకి దూసుకెళ్లడంతో ఘోర రోడ్డు ప్రమాదం (Serious road accident) చోటుచేసుకుంది. ఈ ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని పత్రకార్ కాలనీ సమీపంలో ఉన్న ఖరబాస్ సర్కిల్ (Kharabas Circle) వద్ద జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఒక ఆడి (Audi) కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి, అనంతరం రోడ్డు పక్కన ఉన్న ఫుట్‌పాత్ వ్యాపారులు, ఆహారపు బండ్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో దాదాపు 30 మీటర్ల మేర విధ్వంసం సృష్టించిన కారు, అక్కడ ఉన్న ప్రజలను, పార్క్ చేసిన వాహనాలను ఢీకొట్టింది. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారని, వారు మద్యం సేవించి ఉన్నట్లు అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఈ ప్రమాదంలో రమేష్ బైర్వా అనే వ్యక్తి చికిత్స పొందుతూ మరణించగా, సుమారు 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే జైపూరియా, ఎస్ఎమ్ఎస్ (SMS) ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు సీజ్ చేసి, ఒకరిని అదుపులోకి తీసుకోగా, మిగిలిన వారు పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Next Story