- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థుల ప్రవర్తనపైనా దృష్టి పెట్టాలి
ఇంజినీరింగ్ కాలేజీల్లో పెడదారి పడుతున్న స్టూడెంట్స్ ప్రవర్తనపైనా దృష్టి పెట్టాలని పేరెంట్స్ కోరుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని, ఉన్నత చదువులకై తల్లిదండ్రులు తమ పిల్లలను పేరుపొందిన, ప్లేస్‌మెంట్స్ బాగుండే కాలేజీల్లో చేర్పిస్తున్నారు. అయితే బాగా చదివి జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారని ఆశిస్తే విద్యార్థులు దారి తప్పుతున్నారు. అకడమిక్స్ పైనే దృష్టి పెడుతున్న కళాశాలల యాజమాన్యాలు వారి నడవడికను పట్టించుకోకపోవడంతో లైంగిక దాడులు, వేధింపుల ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల రెండు పేరుపొందిన ఇంజినీరింగ్ కాలేజీల్లో ఇలాంటి ఉదంతాలు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల హైదరాబాద్ బాచుపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో తోటి విద్యార్థినిపై మరో విద్యార్థి లైంగికదాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం సంచలనంగా మారింది. మరోవైపు ఒక మాజీ మంత్రి కాలేజీలో శివరాత్రి వేడుకల సందర్భంగా కొందరు విద్యార్థులు అసభ్యకరమైన చేష్టలకు పాల్పడిన తీరుపైనా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పవిత్రమైన పండుగ రోజున ఇలా చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
యాజమాన్యాల బాధ్యత ఏది?..
ఇటీవలి పరిణామాల నేపథ్యంలో కాలేజీ యాజమాన్యాలు కేవలం అకాడమిక్ మార్కులపైనే కాకుండా, విద్యార్థుల ప్రవర్తన, నడవడికపై కూడా దృష్టి సారించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. క్యాంపస్‌లో విద్యార్థుల కదలికలపై సరైన నిఘా లేకపోవడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థులకు క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ నిర్వహించి, వారిలో బాధ్యతాయుతమైన ప్రవర్తనను పెంపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు. కాలేజీలు కేవలం ఫీజులు వసూలు చేయడమే కాకుండా, విద్యార్థుల క్రమశిక్షణపై కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటున్నారు.






