ఏటిఎంకి 55 ఏళ్లు.. చాక్లెట్ నుండి డ‌బ్బులుగా మారిన వైనం!

by Disha Web Desk 20 |
ఏటిఎంకి 55 ఏళ్లు.. చాక్లెట్ నుండి డ‌బ్బులుగా మారిన వైనం!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః 'క్యాష్‌లెస్ ఇండియా' దిశ‌గా డిజిటల్ చెల్లింపులు నానాటికీ పెరుగుతూ ఉన్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా డిజిట‌ల్ చెల్లింపుల‌కు అల‌వాటు ప‌డిన ఇదే జ‌నం ఐదేళ్ల క్రితం కూడా కరెన్సీ లేని జీవితాన్ని ఊహించుకోవడం క‌ష్ట‌మ‌నే అనుకున్నారు. ఏటిఎం (ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ (ATM) ద్వారా ఎక్కడికక్కడ నగదు అందుబాటులో ఉండ‌టంతో క‌రెన్సీ క‌నుమ‌రుగ‌వ‌డం ఊహ‌కే ప‌రిమిత‌మ‌య్యింది. సాంకేతికంగా అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఇప్ప‌టికీ స‌గం మందికి పైగా న‌గ‌దునే వాడుతున్నారంటే న‌గ‌దు నోటు కుండే విలువ అర్థ‌మ‌వుతుంది. అలాంటి న‌గ‌దును ఎప్పుడైనా అందించ‌గ‌లిగిన‌ ATMకి ఇప్పుడే 55 ఏళ్లు వ‌చ్చాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా మ‌న దేశంలోనూ న‌గ‌దు లావాదేవీలకు ATM అత్యంత ప్రజాదరణ పొందింది. గ్రామాలు, పట్టణాల నుండి చిన్న, పెద్ద నగరాల వరకు ATM మెషీన్లు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్నాయి.

దాదాపు ఐదేళ్ల క్రితం నుండి Paytm, Google Pay, PhonePe, Amazon, WhatsApp వంటి యూపీఐ డిజిట‌ల్ ఖాతాల‌ నుండి ప్రజలు న‌గ‌దు లావాదేవీలు చేస్తున్నప్పటికీ, డబ్బు విత్‌డ్రా చేయడం, డిపాజిట్ చేయడంలో ATMలు ఇప్పటికీ మొదటి స్థానంలో ఉన్నాయి. ఇలాంటి ATM ప్రపంచంలో మొట్టమొదటి సారి 27 జూన్ 1967న, ఉత్తర లండన్‌లోని ఎన్‌ఫీల్డ్ పట్టణంలో ప్రారంభించారు. ముందుగా ఇవి బ్రిటన్‌లో పుట్టాయి. బ్యాంక్ వ‌ద్ద‌ క్యూలో నిలబడి ఇబ్బంది పడిన జాన్ షెపర్డ్ బారన్ అనే వ్య‌క్తి ఈ యంత్రాన్ని తయారు చేశాడు. చాక్లెట్ వెండింగ్ మెషీన్ నుండి బార‌న్‌కు ఈ ఆలోచన రావ‌డం విశేషం. అయితే, మొద‌ట 6 అంకెల పిన్‌ను రూపొందించిన‌ప్ప‌టికీ, అత‌ని భార్య అన్ని అంకెలు గుర్తుపెట్టుకోకపోవడంతో దానిని 4 అంకెలకు తగ్గించారు.

జాన్ షెపర్డ్ బారన్ భారతదేశంలోని షిల్లాంగ్‌లో 23 జూన్ 1925న జన్మించాడు. 2010లో స్కాట్లాండ్‌లో మరణించాడు. బారన్, అతని ఇంజనీరింగ్ బృందం బ్రిటీష్ ప్రింటింగ్ కంపెనీ అయిన డి లా ర్యూలో పనిచేస్తున్నప్పుడు ఆటోమేటెడ్ క్యాష్ సిస్టమ్ మెషీన్‌ను రూపొందించారు. ఇక‌, భారతదేశంలో 90వ దశకంలో ATM వ్యవస్థాపన ప్రారంభమవ‌గా.. దేశంలోని మొట్టమొదటి ATM 1987లో ముంబైలోని HSBC బ్యాంక్ బ్రాంచ్ ఇన్‌స్టాల్ చేసింది.


Next Story

Most Viewed