సురక్షితంగా భూమి మీదకి చేరుకున్న ఆర్టెమిస్‌-2

by Muthe.Rajitha |

చంద్రుడి చుట్టూ తమ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఆర్టెమిస్ -2 సురక్షితంగా తిరిగి భూమి మీదికి ల్యాండ్ అయింది.

సురక్షితంగా భూమి మీదకి చేరుకున్న ఆర్టెమిస్‌-2
X

దిశ, వెబ్ డెస్క్ : మానవ అంతరిక్ష పరిశోధనలో ఒక చారిత్రక ఘట్టం విజయవంతంగా పూర్తయింది. చంద్రుడి చుట్టూ తమ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఆర్టెమిస్ -2 సురక్షితంగా తిరిగి భూమి మీదికి ల్యాండ్ అయింది. సుమారు 54 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, నాసా (NASA) చేపట్టిన ఆర్టెమిస్ 2 (Artemis II) మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములు చంద్రుడి చుట్టూ తమ ప్రయాణాన్ని పూర్తి చేసుకుని భూమిపై సురక్షితంగా అడుగుపెట్టారు. పసిఫిక్ మహాసముద్రంలోని సాన్ డియాగో తీరం సమీపంలో, భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 11 తెల్లవారుజామున 5:37 గంటలకు, వ్యోమగాములు ప్రయాణించిన 'ఓరియన్' (Integrity) క్యాప్సూల్ పారాచూట్ల సాయంతో సముద్రంలో సేఫ్ గా ల్యాండ్ అయింది. ఈ ప్రక్రియను నాసా లైవ్ స్ట్రీమ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వీక్షించారు.

ఆర్టెమిస్ -2 మిషన్ విశేషాలు

ఈ 10 రోజుల చారిత్రక యాత్రలో కమాండర్ రీడ్ వైజ్‌మ్యాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్ చంద్రుడి ఫార్ సైడ్ (అవతలి వైపు) ను దగ్గరగా పరిశీలించడమే కాకుండా, చంద్రుడిపై సూర్యగ్రహణాన్ని కూడా గమనించారు. అపోలో మిషన్ల కంటే ఎక్కువ దూరాన్ని చేరుకుని, అంతరిక్ష చరిత్రలో కొత్త రికార్డులను సృష్టించారు. భూమి వాతావరణంలోకి గంటకు 24,000 మైళ్ల వేగంతో ప్రవేశించినప్పుడు ఓరియన్ క్యాప్సూల్ భరించిన వేడిని, దాని హీట్ షీల్డ్ సమర్థవంతంగా తట్టుకుంది. "నలుగురూ సురక్షితంగా ఉన్నారు" అని కమాండర్ వైజ్‌మ్యాన్ స్వయంగా ప్రకటించడంతో నాసా మిషన్ కంట్రోల్ సెంటర్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. వ్యోమగాములు USS John P. Murtha నౌకకు చేరుకున్న వెంటనే వారికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత వారిని హ్యూస్టన్‌కు తరలిస్తారు.

ఈ మిషన్ విజయం అనేది రాబోయే ఆర్టెమిస్ 3 (Artemis III) మిషన్‌కు కీలక ముందడుగుగా నిలవనుంది. తదుపరి ప్రయోగాల్లో మానవులను చంద్రుడిపై దించేందుకు, అక్కడ శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ యాత్ర ఒక పునాదిగా నిలుస్తుంది. 1972 తర్వాత మానవులను చంద్రుడి దగ్గరకు తీసుకెళ్లి, క్షేమంగా తిరిగి తీసుకురావడం ద్వారా నాసా తన సాంకేతిక సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

Next Story