- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారులో వచ్చి.. కలియ తిరిగి..
నిజామాబాద్ జిల్లాలో దొంగల ముఠా వీరంగం సృష్టించింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వివిధ ప్రదేశాల్లో కారులో కలియదిరిగి మూడు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు.

దిశ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ జిల్లాలో దొంగల ముఠా వీరంగం సృష్టించింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వివిధ ప్రదేశాల్లో కారులో కలియదిరిగి మూడు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత టాటా సుమోలో వచ్చిన దొంగలు ఆర్మూర్ పట్టణంలోని మెడిసిటి మందుల దుకాణంలో షట్టర్ ధ్వంసం చేసి అందులోని సుమారు రూ. లక్షన్నర నగదును దోచుకున్నారు. ఇక్కడ టాటా సుమో లో వచ్చినట్లు సిసి ఫుటేజీ ద్వారా వెలుగు చూసింది. ఇందులో నలుగురు పాల్గొన్నట్లు గుర్తించారు. అనంతరం అక్కడి నుంచి ఆ ముఠా అదే వాహనంలో తెల్లవారుజామున మాక్లూర్ మండలం శ్రీనగర్ కాలనీకి చేరుకుని లక్ష్మీ అనే మహిళ మెడలో నుంచి రెండు తులాల బంగారు పుస్తెలతాడు తెంపుకుని పరారయ్యారు. తధనంతరం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతానికి చేరుకున్నారు.
అక్కడ ఇంటి ముందు వాకిలి ఊడుస్తున్న మరో మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడుతో పాటు ఒక చెవికమ్మను లాక్కున్నారు. మరో చెవికమ్మ లాక్కునే ప్రయత్నం చేస్తుండగా బాధితురాలి కేకలు విని ఆమె భర్త బయటకు రావడంతో వారు టాటా సుమో వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు. అయితే అంతకుముందు దొంగలు నిర్మల్ జిల్లా లో నీ అపార్ట్మెంట్లో దొంగతనాలకు పాల్పడి అర్ధరాత్రి దాటాక జాతీయ రహదారి- 44 నుంచి నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ లోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు. అక్కడి నుండి మరో జాతీయ రహదారి -63 వెంబడి వచ్చి ఆర్మూర్ తో పాటు రహదారి వెంట ఉన్న శ్రీనగర్ , నిజామాబాద్ శివారు ప్రాంతంలోనీ దుబ్బ ఏరియాలో దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు.
ఇది పక్కా అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు చోరీ జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా పని అయి ఉండవచ్చని భావించిన నిజామాబాద్ సీపీ పి. సాయి చైతన్య రంగంలోకి దిగి ఘటన స్థలాలను క్షుణ్నంగా పరిశీలించారు. బాధితురాలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటన జరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించారు. నిందితులను త్వరితగతిన పట్టుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని సిపి సూచించారు.






