- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టమాటా రైతులకు కన్నీళ్లు.. కిలో ఒక్క రూపాయే!
ఏపీలో టమాటా రైతులకు కన్నీరు పెట్టించింది. భారీగా ధర పడిపోవడంతో రైతులు రోడ్లపైనే పంటను పారబోస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో టమాటా సాగు చేసిన రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. విశాఖపట్నం జిల్లాలోని దేవరపల్లి హోల్ సేల్ మార్కెట్లో మంగళవారం ఉదయం టమాటా ధరలు పాతాళానికి పడిపోయాయి. గత నెల ప్రారంభంలో ఆకాశాన్ని తాకిన టమాటా ధరలు, ఇప్పుడు నేల చూపులు చూస్తుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవరపల్లి మార్కెట్లో 30 కేజీల టమాటా బాక్స్ ధర కేవలం 30 రూపాయలు మాత్రమే పలుకుతుండటం గమనార్హం. అంటే కిలో టమాటా ఒక్క రూపాయికే అమ్ముడుపోతోంది. విత్తనాలు, ఎరువులు, సాగు కోసం వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులకు, కనీసం మార్కెట్‌కు పంటను తీసుకురావడానికి అయ్యే రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో వారు మార్కెట్ యార్డులోనే భోరుమంటున్నారు. పంటను అమ్ముకోలేక, ఇంటికి తిరిగి తీసుకెళ్లలేక దిక్కుతోచని స్థితిలో కొంతమంది రైతులు టమాటాలను రోడ్డుపైనే పారబోసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
వ్యాపారుల సిండికేట్.. ప్రభుత్వమే ఆదుకోవాలి
ఈ ధరల పతనానికి వ్యాపారుల సిండికేట్ ప్రధాన కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. హోల్ సేల్ మార్కెట్లలో వ్యాపారులు అంతా ఒక్కటై తక్కువ ధరకే పంటను అడుగుతున్నారని, ప్రభుత్వం దీనిపై జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేవలం దేవరపల్లిలోనే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రధాన హోల్ సేల్ మార్కెట్లలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. దిగుబడి పెరగడం ఒక కారణమైతే, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు లేకపోవడం, ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోవడం రైతులకు శాపంగా మారింది. చేతికి వచ్చిన పంటను కళ్లముందే పారబోస్తూ రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక, అప్పుల ఊబిలో కూరుకుపోతున్న తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వారు కోరుతున్నారు.






