మేక్ ఇన్ ఇండియాలో మరో మైలురాయి.. విమానాల తయారీకి అదానీ-ఎంప్రేయర్ ఒప్పందం

by Malleboina Mahesh |

మేక్ ఇన్ ఇండియాలో పౌర విమానయాన రంగం మరో కీలక మైలురాయిని చేరుకుంది. విమానాల తయారీకి అదానీ-ఎంప్రేయర్ కలిసి ఒప్పందం చేసుకున్నాయి.

మేక్ ఇన్ ఇండియాలో మరో మైలురాయి.. విమానాల తయారీకి అదానీ-ఎంప్రేయర్ ఒప్పందం
X

దిశ, వెబ్‌డెస్క్: మేక్ ఇన్ ఇండియాలో పౌర విమానయాన రంగం (Civil aviation sector) మరో కీలక మైలురాయిని చేరుకుంది. విమానాల తయారీకి అదానీ-ఎంప్రేయర్ కలిసి ఒప్పందం చేసుకున్నాయి. దేశీయంగా విమానాల తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో అదానీ డిఫెన్స్ & ఏరోస్పేస్, బ్రెజిల్‌కు చెందిన ప్రపంచ స్థాయి విమాన తయారీ సంస్థ 'ఎంప్రేయర్' మంగళవారం (జనవరి 27) ఒక చారిత్రాత్మక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు సమక్షంలో న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో, భారతదేశంలో సమగ్ర 'రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ (RTA)' ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ఇరు సంస్థలు ప్రకటించాయి. ఈ భాగస్వామ్యం ద్వారా భారత్‌లో మొట్టమొదటి ప్రైవేట్ రంగ పౌర విమానాల అసెంబ్లీ లైన్ (Final Assembly Line) ఏర్పాటు కానుంది.

ఈ ఒప్పందం ప్రకారం, 80 నుండి 146 సీట్ల సామర్థ్యం ఉన్న ఎంప్రేయర్ వాణిజ్య విమానాలను మన దేశంలోనే అసెంబుల్ చేయడంతో పాటు, విడిభాగాల తయారీ (Indigenisation), సరఫరా వ్యవస్థను పటిష్టం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఆత్మనిర్భర్ భారత్' - 'ఉడాన్' (UDAN) పథకాలకు మద్దతుగా ఈ ప్రాజెక్ట్ సాగనుంది. తద్వారా టైర్-2, టైర్-3 నగరాల మధ్య విమాన అనుసంధానం మెరుగుపడటమే కాకుండా, విదేశాల నుండి విమానాల దిగుమతిపై ఆధారపడటం తగ్గుతుంది. రాబోయే 20 ఏళ్లలో భారతదేశానికి 150 సీట్ల లోపు కేటగిరీలో కనీసం 500 కొత్త విమానాలు అవసరమని అంచనా, ఆ డిమాండ్‌ను ఈ భాగస్వామ్యం ద్వారా దేశీయంగానే తీర్చనున్నారు.

కేవలం విమానాల తయారీకే పరిమితం కాకుండా, విమానాల నిర్వహణ (MRO), విడిభాగాల ఉత్పత్తి, పైలట్ శిక్షణ వంటి రంగాల్లోనూ ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. ఈ ప్రాజెక్ట్ వల్ల విమానయాన రంగంలో వేలాది మందికి ఉన్నత స్థాయి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఎంప్రేయర్ సంస్థకు ఇప్పటికే భారతదేశంలో మంచి పట్టు ఉంది. భారత వైమానిక దళం (IAF), స్టార్ ఎయిర్ వంటి సంస్థలు ఈ కంపెనీ విమానాలను వాడుతున్నాయి. ఈ కొత్త ఒప్పందం భారత్-బ్రెజిల్ దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, భారత విమానయాన రంగం గ్లోబల్ హబ్‌గా ఎదగడానికి దోహదపడుతుందని అదానీ డిఫెన్స్ డైరెక్టర్ జీత్ అదానీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story