తెలంగాణతో భాగస్వామ్యానికి మరో కీలక సంస్థ ఆసక్తి

by Gantepaka Srikanth |

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తెలంగాణతో భాగస్వామ్యం కావడానికి ప్రముఖ హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్ ఆసక్తి వ్యక్తం చేసింది.

తెలంగాణతో భాగస్వామ్యానికి మరో కీలక సంస్థ ఆసక్తి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తెలంగాణతో భాగస్వామ్యం కావడానికి ప్రముఖ హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్ ఆసక్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు అవకాశాలపై కూడా చర్చించేందుకు ముందుకొచ్చింది. ప్రపంచ ఆర్థిక వేదిక–2026 వార్షిక సమావేశాల్లో భాగంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందంతో రాయల్ ఫిలిప్స్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్ జాన్ విల్లెమ్ స్కేజ్రోండ్ (Jan Willem Scheijgrond) భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘తెలంగాణ నెక్స్ట్–జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030’ గురించి తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం రాయల్ ఫిలిప్స్ బృందానికి వివరించింది. 2030 నాటికి 250 బిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థగా లైఫ్ సైన్సెస్ రంగాన్ని అభివృద్ధి చేయడం ఈ పాలసీ ప్రధాన లక్ష్యమని తెలిపింది. మెడికల్ ఎలక్ట్రానిక్స్ సహా అనుబంధ రంగాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు పేర్కొంది.

ఫార్మా రంగానికి ప్రాధాన్యత

ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఔషధ తయారీ, పరిశోధనాభివృద్ధి (R&D) రంగాల్లో ప్రపంచ స్థాయి, స్థిరమైన పారిశ్రామిక క్లస్టర్‌ను తెలంగాణలో నిర్మిస్తున్నారని తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌లో భాగంగా, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR), రిజినల్ రింగ్ రోడ్ (RRR) మధ్యనున్న ప్రాంతాన్ని పెరి–అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE)గా మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టే ప్రణాళికలో ఫార్మా రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కొత్తగా తెచ్చిన లైఫ్ సైన్సెస్ పాలసీ, ఔషధ తయారీ రంగంలో వ్యూహాత్మక ముందడుగులు అందుకు నిదర్శనమన్నారు. తెలంగాణలో ఇప్పటికే 2,000కు పైగా లైఫ్ సైన్సెస్ సంస్థలు, ఐటీ ఆధారిత లైఫ్ సైన్సెస్–హెల్త్ కేర్ టాలెంట్ బేస్, జీనోమ్ వ్యాలీ, 300 ఎకరాలకుపైగా విస్తరించిన మెడికల్ డివైసెస్ - మెడికల్ ఎలక్ట్రానిక్స్ పార్క్ ఉన్నాయని మంత్రి వివరించారు.

హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్

హెల్త్ టూరిజం కేంద్రంగానూ హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, హైదరాబాద్‌లోని ఆస్పత్రులు ఇప్పటికే క్రిటికల్ కేర్, అంబులెన్స్ సేవల వంటి రంగాల్లో ఏఐను సమర్థవంతంగా వినియోగిస్తున్నాయని గుర్తుచేశారు. భవిష్యత్తులో హైదరాబాద్‌ను ఏఐకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏఐ సిటీని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి కీలక సమయంలో రాయల్ ఫిలిప్స్ సంస్థ హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. జీనోమ్ వ్యాలీని సందర్శించాల్సిందిగా జాన్ విల్లెమ్‌ని సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఇప్పటికే మెడ్‌ట్రానిక్, ఒలంపస్, జీఈ వంటి అగ్రశ్రేణి సంస్థల ఎంబెడెడ్ ఇంజినీరింగ్, R&D కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. రాయల్ ఫిలిప్స్ వైస్ ప్రెసిడెంట్ జాన్ విల్లెమ్ స్కేజ్రోండ్ మాట్లాడుతూ, ఆరోగ్య రంగంలో తెలంగాణ అమలు చేస్తున్న ఏఐ ఆధారిత సేవలను ప్రశంసించారు. తెలంగాణతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు. నెదర్లాండ్స్‌లోని రాయల్ ఫిలిప్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించాల్సిందిగా తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించారు.

Next Story