దళిత యువతి వంట చేస్తోందని అంగన్వాడీ సెంటర్ క్లోజ్.. ఎంపీ ఎంట్రీతో మారిన సీన్

by Muthe.Rajitha |

దళిత యువతి వంట చేస్తుందని అంగన్వాడీ కేంద్రాన్ని మూసివేయించగా.. ఎంపీ స్వయంగా వచ్చి, ఆ యువతి చేసిన వంట తిన్నారు.

దళిత యువతి వంట చేస్తోందని అంగన్వాడీ సెంటర్ క్లోజ్.. ఎంపీ ఎంట్రీతో మారిన సీన్
X

దిశ, వెబ్ డెస్క్ : ఒడిశాలో జరిగిన ఓ సంఘటన దేశంలో కుల వివక్ష ఎంత దారుణంగా ఉందో చూపిస్తే, మరో వైపు ఒక చిన్న నిర్ణయం సమాజంలో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో నిరూపించింది. ఇది కేవలం ఒక దళిత అంగన్వాడీలో పనిచేసే వంటమనిషి కథ కాదు. ఇది మన సమాజం ఎదుర్కొంటున్న చేదు వాస్తవం. అలాగే మానవత్వం ఇంకా బ్రతికే ఉందనే ఆశ కూడా.

అసలేం జరిగిందంటే?

ఒడిశాలోని కేంద్రపారా జిల్లా, నుగావ్ గ్రామంలో 2025 నవంబర్లో 23 ఏళ్ల దళిత యువతి శర్మిష్ట సేథిని అంగన్వాడీ సెంటర్‌లో కుక్-కమ్-హెల్పర్‌గా నియమించారు. ఆమె చదువుకున్న గ్రాడ్యుయేట్. సాధారణంగా ఆమె ఉద్యోగం పిల్లలకు పోషకాహారం వండి పెట్టడం. కానీ కొంతమంది ఎగువ కులాల వ్యక్తులు "దళిత మహిళ వంట చేస్తే మా పిల్లలు తినరు" అని అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతే కాదు, తమ పిల్లలను అంగన్వాడీ సెంటర్‌కు పంపడం కూడా మానేశారు. పూర్తిగా ఆపేశారు. ఫలితంగా 3 నెలల పాటు అంగన్వాడీ సెంటర్ దాదాపు మూతపడింది. అయితే ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ కూడా శర్మిష్ట వెనక్కి తగ్గలేదు. ప్రతిరోజూ సైకిల్ మీద సెంటర్‌కు వచ్చేది. సెంటర్ శుభ్రం చేసేది. పిల్లల కోసం భోజనం వండేది. ఆ తర్వాత ఎవరూ రాకపోయినా ఒంటరిగా కూర్చునేది.

కేంద్రమంత్రి ఎంట్రీతో మారిన సీన్

ఈ వ్యవహారాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాగా ఈ వార్త ఒడిశా జాతీయ బీజేపీ వైస్ ప్రెసిడెంట్, కేంద్రపారా ఎంపీ బైజయంత్ జై పండాకు చేరడంతో.. ఆయన వెంటనే స్పందించారు. నేరుగా నుగావ్ గ్రామంలోని అంగన్వాడీ సెంటర్‌కు వెళ్లారు. శర్మిష్టతో మాట్లాడి.. ఆమె తయారు చేసిన భోజనాన్ని గ్రామస్తులు, స్థానిక నాయకులు, అంగన్వాడీ వర్కర్లతో కలిసి తిన్నారు. "ప్రతి బిడ్డకు పోషకాహారం అందాలి. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా అంగన్వాడీ వర్కర్లకు అంతా మద్దతు ఇవ్వాలి" అని స్పష్టం చేసారు. అనంతరం గ్రామంలోని ఎగువ కులాల వారు వారి పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి పంపించడం మొదలు పెట్టారు. ఇపుడు ఆ అంగన్వాడీ సెంటర్ 30 పిల్లలతో కలకలలాడుతోంది.

ప్రస్తుతం జైపండా గ్రామాన్ని సందర్శించి, అంగన్వాడీ సెంటర్లో భోజనం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కులవివక్షను ఎదుర్కోవాలి అంటే చట్టాలు మాత్రమే కాదు, కాస్త దైర్యం, కాస్త మానవత్వం కూడా ఉండాలని.. శర్మిష్ఠ దైర్యం, జైపండా మానవత్వం కులవివక్షను రూపుమాపేందుకు ముందడుగు లాంటిది అని నెటిజన్లు కొనియాడుతున్నారు.

Next Story