వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలి

by Ratna Kumari |

ఏల్‌నీనో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని హనుమకొండ జిల్లా వ్యవసాయ అధికారి వేల్పుల విజయ్ చంద్ర సూచించారు.

వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలి
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : ఏల్‌నీనో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని హనుమకొండ జిల్లా వ్యవసాయ అధికారి వేల్పుల విజయ్ చంద్ర సూచించారు. వర్షపాతం తక్కువగా నమోదవుతున్న పరిస్థితుల్లో నీటి వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని సాగు ప్రణాళికలు రూపొందించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఏల్‌నీనో ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షపాతం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వరి సాగు చేసే రైతులకు నీటి లభ్యత విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులు కంది, మొక్కజొన్న, పెసర, బొబ్బర్లు, కూరగాయలు, చిరుధాన్యాలు, పొద్దుతిరుగుడు, వివిధ నూనెగింజల పంటలు వంటి ఆరుతడి పంటలను సాగు చేయడం మంచిదని సూచించారు.

ఆరుతడి పంటలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవోలు) రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపికపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాలో మొత్తం 2,38,000 ఎకరాల సాగుభూమి ఉందని, గత ఏడాది కాలువల ద్వారా 30 వేల ఎకరాలు, బోరు బావుల ద్వారా 1.38 లక్షల ఎకరాలు, వర్షాధారంగా 32 వేల ఎకరాల్లో సాగు జరిగిందని వివరించారు. కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 63,800 ఎకరాల్లో మాత్రమే సాగు నమోదైందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా బోరు బావులపై ఆధారపడే రైతులు నీటి లభ్యతను అంచనా వేసుకుని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకుంటే నష్టాలను నివారించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి వేల్పుల విజయ్ చంద్ర సూచించారు.

Next Story