2035 నాటికి 2250కి చేరుకోనున్న భారత విమానాల సంఖ్య

by Gantepaka Srikanth |

భారత్‌ విమానయాన రంగం రాబోయే పదేళ్లలో గణనీయమైన వృద్ధిని సాధించనుందని ఎయిర్‌బస్‌ నివేదిక వెల్లడించింది.

2035 నాటికి 2250కి చేరుకోనున్న భారత విమానాల సంఖ్య
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారత్‌ విమానయాన రంగం రాబోయే పదేళ్లలో గణనీయమైన వృద్ధిని సాధించనుందని ఎయిర్‌బస్‌ నివేదిక వెల్లడించింది. 2035 నాటికి దేశంలోని వాణిజ్య విమానాల సంఖ్య మూడు రెట్లు పెరిగి 2,250కు చేరుతుందని, దీంతో భారత్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద పౌర విమానయాన మార్కెట్‌గా అవతరించనుందని పేర్కొంది. విమానాల సంఖ్య పెరుగుదలతో పాటు ప్రయాణికుల రద్దీ కూడా ఏటా 8.9 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేసింది. దేశంలో ప్రస్తుతం 0.13 శాతంగా ఉన్న విమాన ప్రయాణం, వచ్చే పదేళ్లలో 0.29కి పెరుగుతుందని తెలిపింది. ఈ వృద్ధికి వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ పెట్టుబడులు, వినియోగదారుల అభిరుచుల్లో మార్పే ప్రధాన కారణాలుగా పేర్కొంది. విమానాల విస్తరణతో దేశంలో మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ (ఎంఆర్ఓ) రంగం వేగంగా అభివృద్ధి చెందనుందని, ఈ మార్కెట్‌ పరిమాణం 2035 నాటికి 9.5 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని నివేదిక తెలిపింది.

ప్రభుత్వ సహకారంతో విమానాశ్రయాల సంఖ్యను మరో 50 పెంచి, మొత్తం 200 విమానాశ్రయాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. డిజిటలైజేషన్‌, సైబర్‌ సెక్యూరిటీ, విమాన కనెక్టివిటీపై ఎయిర్‌లైన్స్‌ సుమారు 1 బిలియన్‌ డాలర్లు వెచ్చించనున్నట్లు పేర్కొంది. ఈ స్థాయి వృద్ధిని సాధించే క్రమంలో మానవ వనరుల అవసరం కూడా భారీగా పెరుగుతుందని ఎయిర్‌బస్‌ అంచనా వేసింది. 2035 నాటికి దేశానికి 35,000 పైలట్లు, 34,000 టెక్నీషియన్లు అవసరమవుతారని వెల్లడించింది. ప్రపంచ విమానయాన కేంద్రం తూర్పు వైపు మారుతోందని... భారత్‌ అంతర్జాతీయ ట్రాన్సిట్‌ హబ్‌గా ఎదిగే అవకాశాలు ఉన్నాయంటూ ఈ సందర్భంగా ఎయిర్ బస్ ఇండియా అండ్ సౌత్‌ ఏషియా ప్రెసిడెంట్‌ జుర్గెన్ వెస్టర్‌మేయర్‌ తెలిపారు. దేశీయ విస్తరణకు ఏ320 ఫ్యామిలీ, మధ్య-దీర్ఘ దూర అంతర్జాతీయ రూట్లకు ఏ321ఎక్స్ఎల్ఆర్, ఏ350 విమానాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.

Next Story