గతేడాది ఫ్లైట్ క్రాష్.. ఏకైక మృత్యుంజయుడు ఏమన్నాడంటే?

by Muthe.Rajitha |

గతేడాది అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ఘటనలో ఏకైక మృత్యుంజయుడు ఇపుడు ఏమన్నాడంటే?

గతేడాది ఫ్లైట్ క్రాష్.. ఏకైక మృత్యుంజయుడు ఏమన్నాడంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : సరిగ్గా ఏడాది క్రితం 2025 జూన్ 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయిన 32 సెకన్లకే సాంకేతిక లోపంతో బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాలపై కుప్పకూలిపోయింది. ఈ భీకర ప్రమాదంలో విమానంలోని 241 మందితో పాటు హాస్టల్ భవనంలో ఉన్న మరో 19 మంది వైద్య విద్యార్థుల సహా మొత్తం 260 మంది మరణించారు. అయితే, ఆ ఘోర ప్రమాదం నుంచి సీట్ నంబర్ 11Aలో కూర్చుని అద్భుతంగా ప్రాణాలతో బయటపడిన ఏకైక మృత్యుంజయుడు, గుజరాతీ మూలాలున్న బ్రిటీష్ పౌరుడు విశ్వాష్ కుమార్ రమేష్. ఈ ఘోర దుర్ఘటన జరిగి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా, ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని లెస్టర్ లో తన నివాసంలో కోలుకుంటున్న ఆయన ఆరోజు చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

'ఆ అదృష్టం నాకు క్రూరంగా అనిపిస్తోంది'

ప్రమాదం జరిగి ఏడాది గడిచినా ఆ భయానక దృశ్యాలు తన కళ్లముందే కదలాడుతున్నాయని, శారీరక గాయాల కంటే మానసిక గాయాలు తనను నిలువునా దహించివేస్తున్నాయని విశ్వాష్ కుమార్ రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో విశ్వాష్ పక్క సీట్లోనే ఆయన సొంత తమ్ముడు అజయ్ కూర్చుని ఉన్నాడు. కళ్లెదుటే తమ్ముడితో పాటు వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం ఆయనను తీవ్రమైన పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ లోకి నెట్టేసింది. "ప్రపంచమంతా నన్ను ‘లక్కీయెస్ట్ మ్యాన్’ అంటోంది. ఒక రకంగా అది నిజమే, ఇదొక మిరాకిల్. కానీ నా కుటుంబ సభ్యుడిని కోల్పోయిన తర్వాత ఈ బతుకు నాకు చాలా క్రూరంగా అనిపిస్తోంది.

నా జీవితం పూర్తిగా ధ్వంసమైపోయింది” అని కన్నీరు పెట్టుకున్నారు. ప్రమాదం జరిగి ఏడాది గడిచినా, అసలు ఆ 32 సెకన్లలో ఏం జరిగింది? రెండు ఇంజన్లు ఎలా ఆగిపోయాయి? అనే విషయాలపై ఇప్పటికీ పూర్తి స్పష్టత రాలేదని, విచారణ సంస్థల నుంచి తమకు పారదర్శకమైన సమాధానాలు కావాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే టాటా గ్రూప్ మృతుల కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున పరిహారం ప్రకటించినప్పటికీ, ఈ ప్రమాదం మిగిల్చిన శోకం ఆయా కుటుంబాల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ బ్లాక్ డే సందర్భంగా అహ్మదాబాద్‌లోని క్రాష్ సైట్ వద్ద బాధితుల కుటుంబ సభ్యులు ఈరోజు కన్నీటి నివాళులర్పించారు.

Next Story