అమెరికాలో గంజాయితో పట్టుబడ్డ ఎయిరిండియా కోపైలట్

by Muthe.Rajitha |

అమెరికాలో ఎయిరిండియా కోపైలట్ గంజాయితో పట్టుబడటం కలకలం రేపింది.

అమెరికాలో గంజాయితో పట్టుబడ్డ ఎయిరిండియా కోపైలట్
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలో ఎయిరిండియా కోపైలట్ గంజాయితో పట్టుబడటం కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. ఏప్రిల్ 14న ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు ఎయిర్ ఇండియా ఫ్లైట్ (AI173)లో ప్రయాణించిన ఒక కో-పైలట్, తదుపరి విమానాన్ని ఆపరేట్ చేయడానికి 'డెడ్‌హెడింగ్' పద్ధతిలో వెళ్తున్న సమయంలో ఆయన బ్యాగేజీని ఎయిర్‌పోర్టులో యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారులు రొటీన్ తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఆయన బ్యాగ్‌లో గంజాయి బయటపడటంతో అధికారులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో రిక్రియేషనల్ గంజాయి వినియోగం చట్టబద్ధమైనప్పటికీ, అంతర్జాతీయ సరిహద్దులు దాటే ఎయిర్‌పోర్టులు, ఇమ్మిగ్రేషన్ పాయింట్ల వద్ద అమెరికా ఫెడరల్ చట్టాల ప్రకారం ఇది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది.

ఘటన తీవ్రతను గమనించిన యూఎస్ అధికారులు, సదరు కో-పైలట్‌ను అమెరికాలోకి ప్రవేశించేందుకు అనర్హుడిగా (Inadmissible) ప్రకటించారు. ఎటువంటి ఆలస్యం చేయకుండా, వెంటనే ఆయనను తిరిగి భారతదేశానికి బహిష్కరించారు. విమాన ప్రయాణికుల భద్రత, విమానం నడిపే క్రూ సభ్యుల ఆరోగ్యం, క్రమశిక్షణ విషయంలో అత్యంత కఠినంగా ఉండాల్సిన పరిస్థితుల్లో, ఇలా ఒక బాధ్యతాయుతమైన అధికారి డ్రగ్స్ తో దొరికిపోవడం ఎయిర్ ఇండియా యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా ప్రతినిధులు, "మా క్రూ మెంబర్ అమెరికా స్థానిక చట్టాల ప్రకారం అనర్హులుగా తేలడంతో, ఆయన్ని వెనక్కి పంపారు. ఎయిర్ ఇండియాకు డ్రగ్స్ విషయంలో 'జీరో టాలరెన్స్' పాలసీ ఉంది. కాబట్టి, ఆయనపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం" అని స్పష్టం చేశారు.

ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి కూడా సమాచారం అందింది. ప్రస్తుతం ఈ కో-పైలట్‌పై అంతర్గత దర్యాప్తు కొనసాగుతోంది, ప్రాథమికంగా ఆయనను తక్షణమే డ్యూటీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందని విమానయాన వర్గాలు వెల్లడించాయి. పైలట్ల వంటి అత్యున్నత స్థాయి నిపుణులు ఇటువంటి నేరాలకు పాల్పడటం, దేశీయ, అంతర్జాతీయ విమానయాన రంగాల్లో నిబంధనల అమలుపై తీవ్ర చర్చకు దారితీసింది.

Next Story