మేడారం జాతరలో 'AI' బందోబస్తు

by Muthe.Rajitha |

మేడారం మహా జాతరలో AI సాంకేతికతతో బందోబస్తు నిర్వహిస్తున్నారు తెలంగాణ పోలీసులు.

మేడారం జాతరలో AI బందోబస్తు
X

దిశ, వెబ్ డెస్క్ : ఈనెల 28 నుంచి 31 వరకు జరగనున్న మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో AI సాంకేతికతతో బందోబస్తు నిర్వహిస్తున్నారు తెలంగాణ పోలీసులు. 3 రోజులపాటు జరగనున్న ఆసియాలోనే ఈ అతిపెద్ద ఆదివాసీ జాతరకు సుమారు 2 నుంచి 3 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ పర్యవేక్షణలో క్రౌడ్ కంట్రోల్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, తప్పిపోయిన వారిని గుర్తించడం, నేరాలను అడ్డుకోవడం కోసం 'మేడారం 2.0' పేరుతో హైటెక్ భద్రతా వ్యవస్థను అమలు చేస్తున్నారు. ఇందులో ‘TG-QUEST’ అనే AI డ్రోన్ వ్యవస్థ ప్రధానంగా ఉపయోగిస్తున్నారు.

ఈ డ్రోన్లు అటవీ ప్రాంతాలు, జంపన్నవాగు స్నాన ఘట్టాలు, ఆలయ ప్రాంగణాలు, రహదారులను గగనతలం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తాయి. జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను AI ద్వారా ముందుగానే గుర్తించి ప్రమాదం ఉంటే అలర్ట్ ఇస్తాయి. అలాగే హీలియం బెలూన్‌లపై అమర్చిన PTZ కెమెరాలు, 450కు పైగా CCTV కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి ప్రత్యక్ష నిఘా కొనసాగుతుంది. జాతర నిర్వహణకు సుమారు 13,000 మంది పోలీసు సిబ్బంది, 12 ప్రత్యేక క్రైం టీమ్‌లు విధుల్లో ఉండనున్నారు.

అటవీ ప్రాంతంలో ఇరుకైన రోడ్లు పైగా భారీ జనసమూహం వల్ల వచ్చే సమస్యలను ముందే అంచనా వేసేందుకు ఈ AI టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితోసహా మంత్రులు ఎప్పటికప్పుడు స్వయంగా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. భక్తులు త్వరగా దర్శనం చేసుకుని సురక్షితంగా తిరిగి వెళ్లేలా ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది.

Next Story