- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా, నిజామాబాద్ జిల్లాలో నూతన వ్యవసాయ కళాశాల నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారికంగా ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాలోని సుద్దపల్లి, నడపల్లి గ్రామాల పరిధిలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈ కళాశాలను నిర్మించనున్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ) అనుబంధంగా, సుమారు 120 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ రూపుదిద్దుకోనుంది. ఈ కాలేజీ ప్రత్యేకతలలో 5 ఎకరాల్లో ఆధునిక పరిపాలన భవనాలు, 50 ఎకరాల్లో విత్తన అభివ్రుద్ది, విస్తృత పరిశోధన క్షేత్రాలు, 20 ఎకరాల్లో విద్యార్థుల ప్రాక్టికల్స్, 10 ఎకరాల్లో మోడల్ ఫార్మ్ , రైతు శిక్షణ కేంద్రం, 1000 మంది విద్యార్థుల సామర్థ్యం కలిగిన వసతి గృహాలు, సైన్స్ మ్యూజియం, బొటానికల్ గార్డెన్, ఇండోర్ స్టేడియం, ఆడిటోరియం, హెల్త్ సెంటర్ లు ప్రత్యేకతలుగా చెప్పవచ్చు.
మంత్రి తుమ్మల మార్క్:
మూడు దశాబ్దాల క్రితమే అశ్వరావుపేటలో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు బాటలు వేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ విద్యను విస్తరిస్తున్నారు. వ్యవసాయ విద్యార్థులకు నాణ్యమైన శిక్షణతో పాటు, ఉత్తర తెలంగాణ రైతులకు నూతన సాగు పద్ధతులపై అవగాహన కల్పించడమే ఈ కళాశాల ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు. యువతను వ్యవసాయం వైపు ఆకర్షించడం, రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేయడం ద్వారా సాగును లాభసాటిగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో రైతులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కళాశాల ఏర్పాటుపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విద్యార్థులు, రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.






