- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇక్కడ గృహహింస లీగల్.. గాయాలు మాత్రం బయటికి కనిపించకూడదు సుమీ
ఆఫ్గనిస్తాన్ కొత్త పీనల్ కోడ్ మహిళలపై గృహింసను లీగలైజ్ చేస్తోందని అంతర్జాతీయ హక్కుల సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవలి కాలంలో ఆఫ్ఘన్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ప్రపంచం మొత్తం తలవంచుకునేలా చేసింది. మహిళలపై గృహహింసను లీగలైజ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం జనవరి 2026లో ఒక కొత్త 90 పేజీల క్రిమినల్ కోడ్ (పీనల్ కోడ్) జారీ చేసింది. ఈ కోడ్‌పై సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్‌జాదా సంతకం చేశారు. అయితే ఈ పీనల్ కోడ్ వివరాలు గతవారం వెలుగులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఇందులోని కొన్ని ఆర్టికల్స్ మహిళల హక్కులను కాలరాస్తాయని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
కొత్త పీనల్ కోడ్.. కొట్టండి కానీ ఎముకలు విరగవద్దు
ఆఫ్ఘన్ నూతన పీనల్ కోడ్ లోని Article 32 ప్రకారం.. భర్త తన భార్యను "శిక్షించడం" పేరుతో కొట్టవచ్చని పేర్కొనబడింది. అయితే ఎముకలు విరగడం, గాయాలు కనిపించడం, రక్తస్రావం వంటి తీవ్రమైన గాయాలు కలగకూడదని షరతు ఉంది. అలాంటి తీవ్రమైన గాయాలు జరిగితే, భార్య కోర్టులో రుజువు చేస్తే మాత్రమే భర్తకు గరిష్టంగా 15 రోజుల జైలు శిక్ష విధించవచ్చని పేర్కొన్నారు. సాధారణంగా కొట్టడం, బెదిరించడం వంటి చర్యలు నిషేధించబడలేదని మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పుట్టింటికి వెళ్తే జైలుకే
ఇంకా కొన్ని నిబంధనలు మహిళల స్వేచ్ఛను తీవ్రంగా పరిమితం చేస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు, భార్య భర్త అనుమతి లేకుండా తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్తే జైలు శిక్ష విధించవచ్చని పేర్కొనబడింది. కోర్టులో న్యాయం కోరాలంటే మహిళ పూర్తి బుర్ఖా ధరించి, మగ గార్డియన్‌తో హాజరు కావాలని నిబంధన ఉండటం వల్ల మహిళలు న్యాయం పొందడం మరింత కష్టమని విశ్లేషకులు అంటున్నారు.
గృహహింస లీగలైజ్!
రావదరి వంటి ఆఫ్ఘన్ మానవ హక్కుల సంస్థలు ఈ కోడ్‌ను తీవ్రంగా ఖండించాయి. ఐక్యరాజ్యసమితి, హ్యూమన్ రైట్స్ వాచ్ తోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా దీన్ని మహిళలపై గృహ హింసను చట్టబద్ధం చేసే ప్రమాదకరమైన చర్యగా అభివర్ణించాయి. సోషల్ మీడియాలో ఆఫ్గనిస్తాన్ వుమెన్ రైట్స్ వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 2021లో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే మహిళల విద్య, ఉపాధి, ప్రజా జీవితం మీద అనేక ఆంక్షలు విధించబడ్డాయి. ఇప్పుడు ఈ కొత్త క్రిమినల్ కోడ్ ఆ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.






