ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ ఆహార పదార్థాలు

by Malleboina Mahesh |

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల విక్రయం జోరుగా సాగుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో నకిలీ నూనెలు, కుళ్లిన మాంసం ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ ఆహార పదార్థాలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్, కామారెడ్డి: అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల కాదేదీ కవితకనర్హం అన్నాడు ఆనాడు ప్రముఖ కవి శ్రీశ్రీ.. ఏ సందర్భంలో శ్రీశ్రీ ఆ మాటన్నారో కానీ, అదిప్పటి కాలంలో మార్కెట్లో మర్రి ఊడళ్లా విస్తరించుకున్న కల్తీ సరుకులు, నకిలీ వస్తువులకు అన్వయిస్తే కరెక్టుగా సరిపోతుందనిపిస్తోంది. కల్తీ నూనెలు, పాలు, నీరు, ఒకటేమిటి.. ఎందెందు వెతికినా అందందు కలదంటూ పుట్టుకొచ్చే కల్తీ సరుకుల ప్రభావం ప్రజారోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. పది కాలాల పాటు ఆరోగ్యంగా బతకాల్సిన మనుషుల నిండు ప్రాణాలను ఆయుష్షు తీరక ముందే హరిస్తున్నాయి. క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బుల బారిన పడేస్తున్నాయి. మార్కెట్ ను చాపలా చుట్టేసిన కల్తీ సరుకుల వ్యాపారాన్ని నియంత్రించాల్సిన సంబంధించిన కల్తీ నిరోధక శాఖ, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మొద్దు నిద్ర వీడకపోవడంతో కల్తీ వస్తువులు, నకిలీ వస్తువుల దందా మూడు పువ్వులు, ముప్పై కాయల చందంగా వెలిగిపోతోంది.

ఉమ్మడి జిల్లాలో జోరుగా కల్తీ వ్యాపారం..

ఉమ్మడి జిల్లాలో కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. కిరాణా సరుకులు, నూనెలు, పాలు, మిర్చి పౌడర్, ఇతర నిత్యావసర వస్తువులు ఏవీ కొన్నా కల్తీ సరుకులే కొనాల్సి వస్తోందని వినియోగ దారులు వాపోతున్నారు. ఆకలేసి భోజనం చేద్దామని హోటల్ కు వెళ్లినా, రెస్టారెంట్ కు వెళ్లినా అక్కడ నాణ్యమైన ఫుడ్ దొరకడం గగనమైపోయింది. ఫ్రిజ్ లో రోజుల తరబడి స్టోర్ చేసి ఉంచిన చికెన్, మటన్, ఓ పక్క కుళ్లిపోయినదైనా బయట పారేయకుండా మసాలాలు గట్టిగా దట్టించి వండి భోజన ప్రియులకు వినియోగదారులకు వడ్డిస్తున్నారు. మాంసం కుళ్లిపోయిన విషయం వినియోగదారుడు గుర్తు పట్టకుండా ఉండేందుకు ఆకర్షణీయమైన కలర్స్ ను వాడుతూ, మసాలాలు, నూనెలు ఎక్కువగా వేసి వండి పెడుతున్నారు. ఆకలితో ఉన్న వినియోగదారుడు మాంసం కుళ్లిపోయిన విషయాన్ని గమనించకుండానే ఆరగించేయడం కారణంగా ఫుడ్ ఫైజన్ అయిన కేసులు చాలానే ఉన్నాయి.

పశువుల ఎముకలతో నూనెల తయారీ..

ధనార్జనే ధ్యేయంగా మార్కెట్లో వ్యాపారులుగా అవతారమెత్తి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు నడుపుతున్న కొందరు నూనెల తయారీలో అన్ని హద్దులను దాటేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలకు నీళ్లొదిలేస్తూ రహస్య స్థావరాల్లో పశువుల ఎముకలతో వంట నూనెలు తయారు చేస్తూ మార్కెట్లో ఆకర్షణీయంగా ప్యాక్ చేసి అమ్ముతున్నారు. నాణ్యత ప్రమాణాలను తెలియజేసే సింబల్ ను కూడా అడ్డగోలుగా ఉపయోగిస్తూ కల్తీ సరుకునే నాణ్యమైన సరుకుగా ముద్ర వేసి మార్కెట్లోకి వదులుతున్నారు. హోల్ సేల్ వ్యాపారులకు అధిక శాతంలో కమిషన్ ఇస్తూ వాటిని అత్యధిక సంఖ్యలో సేల్ అయ్యేట్లు చూస్తున్నారు. ఎక్కువ మార్కెటింగ్ చేసిన హోల్ సేల్ డీలర్లకు ఆకర్షణీయమైన ప్యాకేజీలిస్తూ ఆకట్టుకుంటున్నారు.

దీంతో ప్రజల ఆరోగ్యాలకు ముప్పుగా పరిణమించే నూనెలను అమ్ముతున్నామని తెలిసినా నిస్సిగ్గుగా వ్యాపారులు అధిక లాభాల కోసం వినియోగ దారులకు అంటగడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పశువుల ఎముకలతో తయారు చేసిన వంట నూనెలు ఎక్కువగా అమ్ముతున్నారనే విషయం బహిరంగ రహస్యమే అయినప్పటికీ కల్తీ నిరోధక శాఖ అధికారులు ఎక్కడా షాపులపైన, వంట నూనెల తయారీ కేంద్రాలపైన దాడులు చేసిన దాఖలాల్లేవు. ఈ మధ్య కాలంలోనైతే అసలు ఎక్కడా కూడా తనిఖీల జోలికి వెళ్లడం లేదు.

హోటల్స్, రెస్టారెంట్స్ పైనే మొక్కుబడి రైడ్స్..

కల్తీ వస్తువులు అడుగడుగునా విస్తరించుకున్న విషయం తెలిసినా ఫుడ్ సేఫ్టీ అధికారులు కేవలం మొక్కుబడిగా గుర్తుకొచ్చినప్పుడల్లా హోటల్స్, రెస్టారెంట్స్ పైనే రైడ్ చేస్తున్నారు. అవి కూడా రోడ్ సైడ్ హోటల్స్, రెస్టారెంట్లే కావడం విశేషం. సూపర్ మార్కెట్లు, హోల్ సేల్ వ్యాపారుల షాపుల సముదాయాల్లో తనిఖీలకు వెళ్లే సాహసం ఎందుకు చేయడం లేదో అధికారులకే తెలియాలి. నిజామాబాద్ నగరంలో గతంలో ప్రముఖ హోటల్స్ పైన హైదరాబాద్ నుండి వచ్చిన తనిఖీ బృందం అధికారుల రైడ్స్ చేసి కేసులు నమోదు చేసినా తీరు మారని పరిస్థితి కనిపిస్తోంది. కల్తీ నిరోధానికి అధికారుల్లో చిత్తశుద్ధి లేనంత కాలం కల్తీ మహమ్మారి ప్రజలను పీడిస్తూనే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story