నిబంధనలకు విరుద్దంగా స్కూళ్లలో అడ్మిషన్లు

by Muthe.Rajitha |

రాష్ట్రంలో అనుమతి లేని పాఠశాలలు, కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని ట్రస్మా డిమాండ్ చేసింది.

నిబంధనలకు విరుద్దంగా స్కూళ్లలో అడ్మిషన్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వం నుండి ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ప్రతినిధులు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, డైరెక్టర్‌కు అధికారికంగా వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో పలు విద్యాసంస్థలు జీవో ఎంఎస్ నంబర్ 1 ప్రకారం అవసరమైన గుర్తింపు, అనుమతులు లేకుండానే అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయని టీఆర్‌ఎస్‌ఎంఏ ఆరోపించింది. ఫిబ్రవరి 14 న ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా అక్రమంగా ప్రవేశ పరీక్షలు, స్కాలర్‌షిప్ టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయని పేర్కొంది.

హోర్డింగ్‌లు, సోషల్ మీడియా, ఇతర ప్రచార సాధనాల ద్వారా విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా భారీ ఫీజు రాయితీలు, అవాస్తవ ఫలితాల పేరుతో ప్రలోభపెడుతున్నాయని తెలిపింది. ఈ సంస్థలు ఫైర్ సేఫ్టీ (ఎన్ఓసీ), జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ విభాగాల నుండి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని ఆరోపించింది. పాఠశాల స్థాయిలో స్టేట్ బోర్డ్ లేదా సీబీఎస్‌ఈ సిలబస్‌కు విరుద్ధంగా ఐఐటీ, నీట్ ఫౌండేషన్ పేరుతో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారని సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. అనుమతి లేని పాఠశాలల్లో చేరడం వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో అపార్, పెన్ నంబర్లు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయని, దీనివల్ల ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాలకు ఆటంకం కలుగుతుందని ట్రస్మా హెచ్చరించింది.

ప్రభుత్వానికి అక్రమ విద్యాసంస్థలపై విచారణకు వెంటనే విజిలెన్స్ టీమ్ను ఏర్పాటు చేయాలని కోరింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, పిల్లలను చేర్పించే ముందు తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అవసరమైన చోట మాత్రమే కొత్త పాఠశాలలకు అనుమతులు ఇచ్చేలా ప్రణాళికాబద్ధమైన విధానాన్ని అమలు చేయాలి. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. మధుసూదన్, ప్రధాన కార్యదర్శి ఎన్. రమేష్ రావు, కోశాధికారి పి. రాఘవేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story