స్వలింగ సంపర్కులైతే నష్టమేంటి? అంగీకారమే.. అసలైన బహుమతి!

by Dishafeatures2 |
స్వలింగ సంపర్కులైతే నష్టమేంటి? అంగీకారమే.. అసలైన బహుమతి!
X

దిశ, ఫీచర్స్ : సొసైటీలోనే బతుకుతూ సాటి మనుషుల గుర్తింపునకు నోచుకోని కమ్యూనిటీ 'ఎల్‌‌జీబీటీక్యూ'. అర్థంకాని ఆలోచనలు, ఆమోదయోగ్యం కాని కోరికలను అదిమిపెట్టి బాల్యాన్ని నెట్టుకొచ్చే ఈ వ్యక్తులు.. స్వేచ్ఛ కోసం తీసే పరుగులో ఫ్రెండ్స్, ఫ్యామిలీకి దూరమవుతున్నారు. తాము కోరుకున్న జీవితం, ఎంచుకున్న మార్గం తల్లిదండ్రులకు నచ్చక కన్న ప్రేమను పొందలేకపోతున్నారు. స్వలింగ సంపర్కాన్ని అసహ్యంగా చూసే విధానం, ట్రాన్స్‌జెండర్స్‌పై అనాదిగా నెలకొన్న తప్పుడు అభిప్రాయాలు పేగు బంధాలకు బీటలు బారుస్తున్నాయి.

తమ పిల్లలు లేదా తోబుట్టువుల జెండర్ స్టేటస్‌ను నిండు మనుసుతో అంగీకరించేంత విశాల హృదయం రక్త సంబంధీకులకూ ఉండట్లేదు. సొసైటీ నార్మ్స్‌తో మబ్బుపట్టిన ఆ బంధం.. ప్రేమ వర్షమై కురిస్తే? వారి ఐడెంటిటీని అంగీకరిస్తే? సెక్సువల్ ఓరియంటేషన్‌ను ఓపెన్‌గా డిస్కస్ చేస్తే? ఈ సమాజం రంగుల వనమై వికసించదా!


ఇటీవల భూమి పెడ్నేకర్, రాజ్‌కుమార్ రావు జంటగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం 'బధాయి దో' స్వలింగ సంపర్కం, లావెండర్ మ్యారేజ్‌పై చర్చను ముందుకు తీసుకెళ్లింది. కాగా LGBTQIA+ కమ్యూనిటీకి వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల మద్దతు చాలా ముఖ్యమని సమాన హక్కుల కార్యకర్త హరీష్ అయ్యర్ తల్లి పద్మ అయ్యర్ తెలిపింది.

ఆమె తన కొడుకు స్వలింగ సంపర్కుడు(గే)గా ఇంటికి వచ్చిన క్షణాలను గుర్తు చేసుకుంది. ఇలాంటి సమయంలో వారు చేసిన పని పేరెంట్స్‌కు ఇష్టమున్నా, లేకున్నా ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ ఒక్కటే జెండర్ మారిన వ్యక్తులకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని చెప్పింది. లేకుంటే వారు సర్వం కోల్పోయినట్లు భావిస్తారని చెప్పుకొచ్చింది.


ఎన్నో రోజుల మానసిక సంఘర్షణ నుంచే..

LGBTQIA+ కమ్యూనిటీ పీపుల్ ఎవరైనా అంగీకరించే విషయం.. ఒక వ్యక్తి తన ఒరిజినల్ జెండర్ ఐడెంటిటీని బయటపెట్టేందుకు ఎన్నో రోజులు మానసిక సంఘర్షణకు గురవుతారు. చుట్టూ ఉన్న వ్యక్తులు, సమాజం అంగీకరిస్తుందా లేదా అని రకరకాల ఆలోచనలతో నలిగిపోతారు. అంతేగాని ఒక మంచి రోజు చూసుకుని ఈ విధంగా చేయరు.

అంతర్గత కల్లోలాన్ని దాటుకుని, ఎన్నో రోజుల పునరాలోచనల తర్వాత ఇందుకోసం మానసికంగా సిద్ధమవుతారు. ఇలాంటి సమయంలో వారికి సన్నిహితుల నుంచే సపోర్ట్ లభించకపోతే.. తమ బాధను ఇంకెవరితో పంచుకుంటారని పద్మ అయ్యర్ ప్రశ్నించింది.


లైంగిక ధోరణిపై ఇంట్లో బహిరంగ చర్చ అవసరం..

'మిస్టర్ గే వరల్డ్ ఇండియా 2018'లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచిన ఆశిష్ చోప్రా తల్లికి తన కొడుకు 'గే' లక్షణాల గురించి తెలుసుకునేందుకు కొంత సమయం పట్టింది. కానీ అతడి సోదరుడు విశేష్ చోప్రా ఈ విషయం గురించి రెగ్యులర్‌గా ఆమెతో మాట్లాడినప్పుడు అర్థం చేసుకుంది. ఆశిష్ గురించి విశేష్‌కు ముందే తెలిసినప్పటికీ తల్లికి మాత్రం అదంతా కొత్త.

పైగా చుట్టుపక్కల వ్యక్తుల మాటలు ఆమెను మరింతగా భయపెట్టాయి. అయితే అదేమీ అసహజ లేదా అనైతిక విషయం కాదని వివరించడంతో అనేక ప్రశ్నలు, సందేహాల తర్వాత ఆమె తన కొడుకును పూర్తిగా అర్థం చేసుకుంది. చాలా కుటుంబాలు కూడా ఇలాంటి విచారం, గందరగోళ స్థితినే ఎదుర్కొంటున్నాయని విశేష్ చెప్పుకొచ్చాడు.

బెంగళూరు జంట నేత్ర శ్రీకాంత్- లీనా

నేత్ర శ్రీకాంత్ తన కమ్యూనిటీ ఫ్రెండ్స్‌, కుటుంబ సభ్యులతో పాటు పిల్లలు కూడా తనకు అతిపెద్ద సపోర్ట్‌గా ఉన్నారని నమ్ముతుంది. ఆమె మొదటి వివాహం నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంది. అయినా తన పిల్లల్లో అసాధారణ మార్పులేమీ చూడలేదు. ఎందుకంటే మన స్వంత వ్యక్తిగత జీవితాలు, చాయిసెస్‌తో సంబంధం లేకుండా తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలను ప్రేమిస్తారని, కేర్ తీసుకుంటారని పిల్లలు నమ్ముతారనేది ఆమె థియరీ. అందుకే పిల్లలతో తన ఫీలింగ్స్ ఓపెన్‌గా షేర్ చేసుకుంటుంది. జెండర్ ఐడెంటిటీ, లైంగిక ధోరణి గురించి ఓపెన్‌గానే చర్చిస్తుంది.

జనాలు ఏం అనుకుంటున్నారో అనేది వదిలేయాలి..

కుటుంబాల నుంచి బహిష్కరించబడటమే అతిపెద్ద భయాల్లో ఒకటి. కానీ ఎవరేమనుకున్నా పిల్లలకు అండగా నిలబడాలని పేరెంట్స్ నిర్ణయించుకున్న రోజు.. అనవసర ప్రాముఖ్యతల కన్నా పిల్లలే ముఖ్యమని నమ్మిన రోజు.. సమాజం పట్ల భయాల నుంచి విముక్తి పొందుతారని పద్మ అయ్యర్ వివరించింది. ఇదంత సులభం కాకపోయినా ఇప్పుడు అనేక ఫోరమ్స్, సపోర్ట్ గ్రూపులతో పాటు ఎడ్యుకేషన్ లిటరేచర్ అందుబాటులో ఉంది. కాబట్టి సమాజ భావనలు వీడి, మిమ్మల్ని మీరే కొత్తగా ఆవిష్కరించుకోండి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed