అడిషనల్‌ కలెక్టర్‌ ఇంట్లో ముగిసిన ACB సోదాలు.. రూ.7.69 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-21 14:01:55  IST  )

హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి (ఇన్‌చార్జ్) అర్రమడ వెంకట్ రెడ్డి అక్రమాస్తుల బాగోతం బట్టబయలైంది.

అడిషనల్‌ కలెక్టర్‌ ఇంట్లో ముగిసిన ACB సోదాలు.. రూ.7.69 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు
X

దిశ, వెబ్‌డెస్క్: హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి (ఇన్‌చార్జ్) అర్రమడ వెంకట్ రెడ్డి అక్రమాస్తుల బాగోతం బట్టబయలైంది. ఇప్పటికే లంచం తీసుకుంటూ పట్టుబడి సస్పెన్షన్‌లో ఉన్న ఆయనపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి, ఇవాళ సరూర్‌నగర్‌లోని ఆయన నివాసంతో మొత్తం 8 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ ప్రాథమిక సోదాల్లో సుమారు రూ.7,69,38,332 విలువైన స్థిర, చరాస్తులను అధికారులు గుర్తించారు. అందులో హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో రెండు నివాస గృహాలు ఉన్నాయి. వాటి విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.4.65 కోట్లని తెలుస్తోంది. ఒక కమర్షియల్ షాపు రూ.60 లక్షలు, అదేవిధంగా రూ.65 లక్షలు విలువ చేసే ఎనిమిది ఓపెన్ ప్లాట్లు, రూ.50 లక్షలు విలువ చేసే 14.25 ఎకరాల వ్యవసాయ భూమి, నగదు రూ.30 లక్షలు, బ్యాంక్ సేవింగ్స్ మరో రూ.44 లక్షలు, మూడు విలాసవంతమైన కార్లు.. వాటి విలువ రూ.40 లక్షలు, 297 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.11 లక్షలు విలువ చేసే గృహోపకణాలను ఏసీబీ అధికారులు గుర్తించారు.

కాగా, గతంలో ఒక ప్రైవేట్ పాఠశాల అనుమతి కోసం లంచం తీసుకుంటూ వెంకట్ రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. ఆ కేసు విచారణలో భాగంగా ఆయన అక్రమ సంపాదనపై దృష్టి సారించిన అధికారులు, ఈ భారీ అక్రమాస్తులను గుర్తించారు. ఈ మేరకు ఆయనపై 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

Next Story