- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవినీతి అహంకారానికి ఏసీబీ బేడీలు..!
"అదొక్కటే కాదు మాకు చాలా పనులు ఉంటాయి.. అయ్యే టైమ్‌కు అవుతుంది.. మమ్మల్ని అడగొద్దు ఏమన్నా ఉంటే కలెక్టర్ ను అడగండి" అంటూ బాధితులు, ఫిర్యాదుదారులుపై నాడు అహంకారంతో విరుచుకుపడ్డ ఆ ఉన్నతాధికారికి కాలం సరిగ్గా ఆయన అన్నట్లే సమాధానం చెప్పింది.

దిశ, మేడ్చల్ బ్యూరో: "అదొక్కటే కాదు మాకు చాలా పనులు ఉంటాయి.. అయ్యే టైమ్‌కు అవుతుంది.. మమ్మల్ని అడగొద్దు ఏమన్నా ఉంటే కలెక్టర్ ను అడగండి" అంటూ బాధితులు, ఫిర్యాదుదారులుపై నాడు అహంకారంతో విరుచుకుపడ్డ ఆ ఉన్నతాధికారికి కాలం సరిగ్గా ఆయన అన్నట్లే సమాధానం చెప్పింది. నిజాంపేట్‌లోని రూ. కోట్లు విలువ చేసే సర్వే నంబర్ 334 ప్రభుత్వ భూములను సర్వే చేయకుండా కాలయాపన చేస్తూ, కబ్జాదారులకు పరోక్షంగా కొమ్ముకాస్తున్న ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇల్లే ఒక అవినీతి సామ్రాజ్యమని ఏసీబీ దాడుల్లో తేలింది. "అయ్యే టైమ్‌కు అవుతుంది" అన్న ఆయన మాటే.. ఇప్పుడు ఆయన అవినీతి బాగోతం బయట పడి ఏసీబీకి దొరికిపోయే టైమ్ రూపంలో రావడం గమనార్హం.
కలెక్టర్ లేఖ రాసినా కదలని ఫైల్!
నిజాంపేట్ సర్వే నంబర్ 334 లోని విలువైన ప్రభుత్వ భూముల సర్వే అంశంపై జిల్లా కలెక్టర్ స్వయంగా ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్‌మెంట్‌కు లేఖ రాసి ఆరు నెలలు గడుస్తున్నా సదరు అధికారి నరహరి కించిత్ కూడా పట్టించుకోలేదు. ఈ ఫైల్ (Lr.no. LP/2245/2024 తేది: 18.12.2025) పై ప్రాసెస్ సాగుతోందంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతున్న, సర్వే నిర్వహించి భూములను కాపాడాలన్న ఉద్దేశం సదరు అధికారికి లేకపోవడం వెనుక భారీ హస్తమే ఉందన్న అనుమానాలు నిజమయ్యాయి. కబ్జాదారుల నుంచి అందిన భారీ నజరానాలు వల్లే ఈ సర్వే ప్రక్రియను తొక్కిపెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కిలోల్లో బంగారం.. ఇంటి నిండా నోట్ల కట్టలు!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇల్లు, కార్యాలయాలు మరియు ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో కళ్ళు చెదిరే నిజాలు బయటపడ్డాయి. ప్రాథమిక తనిఖీల్లోనే సుమారు రూ. 200 కోట్ల అక్రమాస్తులు అధికారులు గుర్తించినట్లు సమాచారం. బెడ్‌రూమ్‌లో బెడ్ కింద రూ. 1.10 కోట్ల విలువైన నోట్ల కట్టలు, బీరువాల్లో కిలోల కొద్దీ బంగారం, వెండి ఆభరణాలు, భారీగా ల్యాండ్ బాండ్ పేపర్లు లభ్యమవటం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
లేఖలతోనే కాలయాపన..
మరోవైపు నిజాంపేట్ సర్వే నంబర్ 334 లో జరుగుతున్న అక్రమ కట్టడాలు, కబ్జాలపై బాధితులు ఇప్పటికే ఆర్డీఓ, జిల్లా కలెక్టర్‌కు పలువురు ఫిర్యాదులు చేశారు. దీనికి స్పందనగా స్థానిక ఎమ్మార్వో కార్యాలయం మొదలుకొని ఆర్ డి ఓ, డిస్టిక్ కలెక్టర్, ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్మెంట్‌ల మధ్య లేఖల పర్వం కొనసాగుతోంది కానీ ఇప్పటివరకు సర్వే చేసి ప్రభుత్వ భూమిని సంరక్షించాలనే విధంగా అడుగులు పడిన సందర్భం లేదనే చెప్పాలి.
ఈ మధ్యకాలంలో సర్వే నంబర్ 334 లో ఒకటి రెండు అక్రమ నిర్మాణాలను కూల్చి రెవెన్యూ అధికారులు చేతులు దులుపినారే తప్ప , భారీ కట్టడాలపై మాత్రం ఇంతవరకు చర్యలు లేవు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన సర్వే విభాగం అధికారే అవినీతి ఊబిలో కూరుకు పోవడంతో, కబ్జాదారుల వెనుక ఉన్న అసలు సూత్రధారులు కూడా బయటకు లాగాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీఐ దరఖాస్తుల ద్వారా ఫిర్యాదుదారులు సేకరించిన సమాచారం ప్రకారం ఈ భూముల పై పెద్ద ఎత్తున నీలినీడలు కమ్ముకున్నాయి. ఏసీబీ దాడుల అనంతరం అయినా ఉన్నతాధికారులు స్పందించి, నిజాంపేట్ సర్వే నంబర్ 334 లోని విలువైన ప్రభుత్వ భూమిని తక్షణమే సర్వే చేసి కబ్జాదారుల బారి నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.






