ఏడుగురు ఎంపీల సభ్యత్వం రద్దు చేయండి.. రాజ్యసభ ఛైర్మన్‌కు ఆప్ ఫిర్యాదు

by Malleboina Mahesh |

బీజేపీలో చేరిన ఏడుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని రాజ్యసభ ఛైర్మన్‌కు సంజయ్ సింగ్ ఫిర్యాదు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద సభ్యత్వాలను రద్దు చేయాలని విజ్ఞప్తి.

ఏడుగురు ఎంపీల సభ్యత్వం రద్దు చేయండి.. రాజ్యసభ ఛైర్మన్‌కు ఆప్ ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ పార్టీలో సంభవించిన రాజకీయ సంక్షోభం ఇప్పుడు మరింత ముదిరింది. పార్టీని వీడి బీజేపీలో చేరిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఆప్ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ సింగ్ ఆదివారం (ఏప్రిల్ 26, 2026) రాజ్యసభ చైర్మన్ సి.పి. రాధాకృష్ణన్‌కు అధికారికంగా వినతిపత్రం సమర్పించారు. రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికై, ఇప్పుడు పార్టీని వీడటం రాజ్యాంగ విరుద్ధమని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఏడుగురు ఎంపీలు ఆప్ గుర్తుపై గెలిచి, ఇప్పుడు వేరే పార్టీలో చేరడం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (Anti-Defection Law) నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని సంజయ్ సింగ్ వాదించారు. రాజ్యసభ లేదా లోక్‌సభలో ఎలాంటి 'చీలిక' (Split) లేదా 'గ్రూపులుగా విడిపోవడం' చట్టబద్ధం కాదని, 2/3వ వంతు మెజారిటీ ఉన్నప్పటికీ సభ్యత్వం రద్దు కావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో తాము సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పి.డి.టి. ఆచార్య వంటి నిపుణులను సంప్రదించామని, సదరు ఎంపీలు అనర్హతకు గురయ్యే అవకాశం ఉందని వారు అభిప్రాయపడినట్లు సంజయ్ సింగ్ వెల్లడించారు.

నేపథ్యం..

శుక్రవారం (ఏప్రిల్ 24) ఆప్‌కు చెందిన 10 మంది రాజ్యసభ ఎంపీల్లో ఏడుగురు (రాఘవ్ చడ్డా, హర్భజన్ సింగ్, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, స్వాతి మలివాల్, విక్రమ్ సాహ్నీ, రాజీందర్ గుప్తా) బీజేపీలో విలీనమయ్యారు. వీరంతా తమది చట్టబద్ధమైన 'విలీనం' (Merger) అని వాదిస్తుండగా, ఆప్ దీనిని 'ఆపరేషన్ లోటస్' గా అభివర్ణిస్తూ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజ్యసభ ఛైర్మన్ పరిశీలనలో ఉంది. ఆయన తీసుకోబోయే నిర్ణయంపై ఈ ఏడుగురు ఎంపీల రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

Next Story