- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొడంగల్ సరిహద్దుల్లో ‘నోయిడా’ మార్క్.. రూ.600 కోట్లతో విశ్వవిద్యాలయాల ఊరు!
కొడంగల్ ఇలాకా విద్యా ముఖచిత్రం సమూలంగా మారిపోతోంది!

దిశ,కొడంగల్: కొడంగల్ ఇలాకా విద్యా ముఖచిత్రం సమూలంగా మారిపోతోంది! నిన్నటివరకు కేవలం సాగు పనులకు, వలసలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ వెనుకబడిన ప్రాంతం.. రేపు అంతర్జాతీయ స్థాయి విద్యా కుసుమాలకు వేదిక కాబోతోంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా నగరం ఏ విధంగానైతే విద్యా రంగంలో సరికొత్త రికార్డులు సృష్టించిందో.. అదే తరహాలో మన తెలంగాణ గడ్డపై రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో సరికొత్త చరిత్ర లిఖించబడుతోంది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండల పరిధిలోని హకీంపేట గ్రామంలో 248 ఎకరాల సువిశాల సామ్రాజ్యంలో నిర్మిస్తున్న ‘మెగా ఎడ్యుకేషన్ హబ్’ పనులు ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి.
248 ఎకరాల్లో 'అక్షరాల' అద్భుతం..!
మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులు కూడా పైసా ఖర్చు లేకుండా కేజీ నుంచి పీజీ వరకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉచిత విద్యను అభ్యసించాలనేదే ఈ ప్రాజెక్టు అసలు లక్ష్యం. ఈ విద్యా కాంప్లెక్స్ అందుబాటులోకి వస్తే.. కొడంగల్, దుద్యాల, దౌల్తాబాద్, పరిగి, కోస్గి మండలాల పరిధిలోని దాదాపు 4 వేల మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తు లభించనుంది.
దేనికి ఎంత ఖర్చు? ఎప్పటికీ పూర్తవుతాయి?
ఈ మెగా క్యాంపస్‌లో నిర్మిస్తున్న విద్యా సంస్థలు, వాటి గడువుల వివరాలు ఇలా ఉన్నాయి:
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్:
రూ. 200 కోట్లతో నిర్మిస్తున్న ఈ అత్యాధునిక స్కూల్ బిల్డింగ్‌ను ఈ ఏడాది 2026 డిసెంబర్ నాటికే పూర్తి చేసేందుకు అధికారులు రాత్రింబగళ్లు శ్రమిస్తున్నారు. ఇందులో ఒకేసారి 2 వేల మంది విద్యార్థులు చదువుకోవచ్చు.
మెడికల్ & నర్సింగ్ కాలేజీలు:
గ్రామీణ ప్రాంతాలకు వైద్యవిద్యను దగ్గర చేసేందుకు నిర్మిస్తున్న మెడికల్, నర్సింగ్, పారామెడికల్ భవనాల కోసం ప్రాథమికంగా రూ.19 కోట్లు విడుదలయ్యాయి. ఇవి 2027 జూన్ నాటికి అందుబాటులోకి రానున్నాయి.
రూ.200 కోట్ల వెటర్నరీ కాలేజ్:
పశుసంపదే ఊపిరిగా బతుకుతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ.200 కోట్లతో నిర్మిస్తున్న పశువైద్య భవనాలు 2028 ఆగస్టు నాటికి పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇంజనీరింగ్, ఉమెన్స్ డిగ్రీ కాలేజీలు:
ఇంజనీరింగ్ కాలేజీ కోసం రూ.1.5 కోట్లు, మహిళల ఉన్నత విద్యా సాధికారత కోసం మహిళా డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి రూ.6.10 కోట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. ఈ పనులన్నీ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికే పూర్తి కానున్నాయి.
బాలికల గురుకుల పాఠశాల:
రూ.2.5 కోట్లతో నిర్మిస్తున్న ఈ పాఠశాల 2027 నాటికి సిద్ధం కానుంది.
దశాబ్దాల వెనుకబాటుకు చెక్!
వ్యవసాయం తప్ప మరో జీవనాధారం లేని ఈ ప్రాంతాల్లో యువతకు స్థానికంగా పెద్ద చదువులు చదువుకునే వీలుండేది కాదు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఈ దార్శనిక నిర్ణయం ఇక్కడి యువత తలరాతను మార్చబోతోంది. 2027 విద్యాసంవత్సరం నాటికి ఈ ఎడ్యుకేషన్ హబ్‌లో అధికారికంగా రెగ్యులర్ క్లాసులు ప్రారంభం కానున్నాయని జిల్లా ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.
క్వాలిటీలో తగ్గేదే లేదు: కాడా(KADA) స్పెషల్ ఆఫీసర్
"మెగా ఎడ్యుకేషన్ హబ్ పరిధిలోని అన్ని విద్యాసంస్థల మౌలిక వసతుల కల్పనకు, నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లు ఖర్చు చేస్తోంది. భవిష్యత్ తరాల విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ పనుల్లో ఎక్కడా ఎలాంటి నాణ్యత లోపాలు లేకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (KADA) ప్రత్యేకాధికారి వెంకట్ రెడ్డి అన్నారు.






