- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లనేరేడు నీడలో జాతర్ల
ప్రకృతిని ప్రేమిస్తే ఒక గ్రామం ఎంత అందంగా మారుతుందో చూడాలంటే జాతర్ల గ్రామాన్ని సందర్శించాల్సిందే.

దిశ, బజార్ హత్నూర్ : ప్రకృతిని ప్రేమిస్తే ఒక గ్రామం ఎంత అందంగా మారుతుందో చూడాలంటే జాతర్ల గ్రామాన్ని సందర్శించాల్సిందే. పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకర వాతావరణంతో అలరారుతున్న ఈ ఆదివాసీ గ్రామం నేడు అల్లనేరేడు చెట్లకు నిలయంగా మారింది. ఊరంతా అల్లనేరేడు చెట్లతో కళకళలాడుతుండటంతో జాతర్ల గ్రామంకు ప్రత్యేక గుర్తింపు లభించింది. సాధారణంగా గ్రామాల్లో ఇళ్ల ముందు పూల మొక్కలు, వివిధ రకాల పండ్ల చెట్లు కనిపిస్తాయి. కానీ జాతర్ల గ్రామంలో మాత్రం దాదాపు ప్రతి ఇంటి ముందు అల్లనేరేడు చెట్టే కనిపిస్తుంది. ఇంటి ముంగిట నిలబడి చూస్తే పచ్చని ఆకులతో విరబూసిన చెట్లు ఆహ్వానం పలుకుతాయి. వేసవి కాలంలో నల్లటి అల్లనేరేడు పండ్లతో చెట్లు నిండిపోతే గ్రామమంతా ఒక ప్రత్యేక అందాన్ని సంతరించుకుంటుంది. ఈ పచ్చదన విప్లవానికి బీజం పడింది 1981 సంవత్సరంలో. ఆ సమయంలో గ్రామాన్ని సందర్శించిన తొలి ఆదివాసీ ఐపీఎస్ అధికారి మాడవి తుకారం గ్రామంలో ఉన్న కొద్ది అల్లనేరేడు చెట్లను గమనించారు. ఈ చెట్లు ఊరంతా ఉంటే గ్రామానికి మరింత అందం వస్తుందని భావించి ఐటీడీఏ ద్వారా మొక్కలను అందజేశారు. గ్రామస్తులు వాటిని కేవలం నాటడమే కాకుండా కన్నబిడ్డల్లా పెంచి సంరక్షించారు.
కాలం గడిచేకొద్దీ గ్రామం అభివృద్ధి చెందింది. కొత్త ఇళ్లు నిర్మించబడ్డాయి. అయినప్పటికీ చెట్లను నరికివేయకుండా ప్రతి ఇంటి వద్ద ఒక అల్లనేరేడు చెట్టు ఉండేలా చూసుకున్నారు. కొందరు రైతులు తమ పొలాల గట్ల వెంట కూడా మొక్కలను నాటి పచ్చదనాన్ని విస్తరించారు. ఫలితంగా నేడు జాతర్ల గ్రామం దూరం నుంచే పచ్చని దుప్పటి కప్పుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇక్కడ అతిథి మర్యాదలకు కూడా అల్లనేరేడు పండ్లకే ప్రత్యేక స్థానం ఉంది. పండ్ల సీజన్‌లో ఇంటికి వచ్చిన బంధువులు, స్నేహితులకు అల్లనేరేడు పండ్లు అందించడం ఆనవాయితీగా మారింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ పండ్ల కోసం జాతర్లకు వస్తుంటారు. గ్రామ ప్రజల ఆతిథ్యానికి, ప్రకృతి ప్రేమకు ఈ సంప్రదాయం నిదర్శనంగా నిలుస్తోంది.
గ్రామస్తుల ప్రకృతి ప్రేమ హరితహారం కార్యక్రమంలోనూ ప్రతిఫలించింది. పంచాయతీ సహకారంతో గ్రామ రహదారుల వెంట వేలాది మొక్కలు నాటగా అవి నేడు మహావృక్షాలుగా ఎదిగి పచ్చని తోరణాల్లా దర్శనమిస్తున్నాయి. చెట్ల నీడలో ప్రయాణించే వారికి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం మాటల్లో కాకుండా ఆచరణలో చూపించిన జాతర్ల గ్రామ ప్రజలు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రకృతిని ప్రేమిస్తే గ్రామం ఎలా స్వర్గధామంగా మారుతుందో జాతర్ల గ్రామం మరోసారి నిరూపిస్తోంది.






