- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు గుడ్ న్యూస్.. బోనస్ ఇచ్చే సన్నవడ్ల విత్తనాలు సబ్సిడీపై పంపిణీకి సీఎం ఆదేశాలు
రైతు వేదికల్లో 7 రకాల సన్నవడ్ల విత్తనాలను సబ్సిడీపై అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు:
ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఇబ్బంది పడకుండా వచ్చే సీజన్ నుంచే కొనుగోళ్లు సాఫీగా జరిగేలా ఒక ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో పనిచేసే ఈ కమిటీలో వ్యవసాయ శాఖ డైరెక్టర్, పౌర సరఫరాల శాఖ ఎండీ, ప్రణాళికా విభాగం కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. విత్తనాల పంపిణీ, పంటల వివరాల నమోదు, రికార్డులు, దిగుబడి అంచనాలు, ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు వివిధ దశల్లో చేపట్టాల్సిన చర్యలను ఈ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఏ రైతు ఏ పంట వేశాడు, ఏ గ్రామంలో ఎంత విస్తీర్ణంలో పంటలు ఉన్నాయనే వివరాలను కచ్చితంగా క్షేత్ర స్థాయి పరిశీలనతో నమోదు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
సన్న వడ్లకు బోనస్.. రైతు వేదికల్లోనే విత్తనాలు:
సన్న వడ్లు పండించే రైతులకు ప్రభుత్వం బోనస్ ఇస్తున్న నేపథ్యంలో, బోనస్ లభించే 7 రకాల సన్న వడ్ల విత్తనాలను రైతు వేదికల్లోనే అందుబాటులో ఉంచాలని, వాటిని సబ్సిడీపై రైతులకు అందించాలని సీఎం ఆదేశించారు. సన్న వడ్లు పండించే రైతుల పూర్తి డేటాను సేకరించాలని సూచించారు. ఇకపై రైతు వేదికలను రైతులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని, ప్రతి రైతు వేదిక వద్ద వ్యవసాయ శాఖతో పాటు రెవెన్యూ, పోలీస్ విభాగాల నుంచి ఒక్కో అధికారి అందుబాటులో ఉండాలని చెప్పారు. జిల్లాల్లో వీటి నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను అదనపు కలెక్టర్లకు అప్పగించాలన్నారు.
యాప్ ద్వారా ఎరువుల బుకింగ్స్:
ఎరువుల పంపిణీలో పారదర్శకత, వేగం పెంచేందుకు అన్ని రకాల ఫెర్టిలైజర్లను యాప్ ద్వారా బుక్ చేసే విధానాన్ని తీసుకురావాలని సీఎం ఆదేశించారు. యాప్ ద్వారా రైతులు బుక్ చేసుకున్న యూరియాను రైతు వేదికల ద్వారా పంపిణీ చేయాలని, ఈ బాధ్యతను జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగించాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ప్రారంభించిన ఏఐ (AI) పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలను అధ్యయనం చేసి వ్యవసాయ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను మరింతగా వినియోగించాలని సూచించారు. ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన యూరియా, ఎరువుల కేటాయింపులపై ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖలు రాయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సీఎం సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరువులను అత్యధికంగా తెలంగాణకే కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో ఎరువుల పరిస్థితిపై అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించి, వాస్తవ పరిస్థితిని వివరించాలని.. అవసరమైతే మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని స్పష్టం చేశారు.
ఆయిల్‌ఫెడ్, ప్రభుత్వ డైరీ బలోపేతం:
మార్క్‌ఫెడ్ నష్టాలను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల ఈసారి మొక్కజొన్న కొనుగోళ్లలో నష్టం తగ్గించగలిగామని, గతంలో టన్ను రూ.13 వేలకు అమ్మిస్తే, ఈసారి టెండర్ రేట్ దాదాపు రూ.21 వేల పైగా వచ్చిందని తెలిపారు. ఆయిల్‌ఫెడ్‌ను మరింత బలోపేతం చేసి లాభాల దిశగా నడిపించాలని, అలాగే ప్రభుత్వ డైరీని బలోపేతం చేస్తూ పాల రైతులకు సకాలంలో చెల్లింపులు జరపాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.






