- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభివృద్ధి ప్రదాత ఆశలకు అంతరాయం..?
కేసముద్రం మండల అభివృద్ధి కోసం రాజ్యసభ సభ్యుడు వేమ్ నరేందర్ రెడ్డి చేస్తున్న కృషికి ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నప్పటికీ, అధికార పార్టీలోని కొందరు నాయకుల వ్యవహారశైలి అభివృద్ధి పనులకు ఆటంకంగా మారుతోందనే చర్చ మండల వ్యాప్తంగా సాగుతోంది.

దిశ, కేసముద్రం : కేసముద్రం మండల అభివృద్ధి కోసం రాజ్యసభ సభ్యుడు వేమ్ నరేందర్ రెడ్డి చేస్తున్న కృషికి ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నప్పటికీ, అధికార పార్టీలోని కొందరు నాయకుల వ్యవహారశైలి అభివృద్ధి పనులకు ఆటంకంగా మారుతోందనే చర్చ మండల వ్యాప్తంగా సాగుతోంది. ముఖ్యంగా ప్రధాన రహదారి విస్తరణ వంటి కీలక పనుల్లో ప్రజల సహకారం కోరుతున్న నాయకులు ముందుగా తామే ఆదర్శంగా నిలవాలనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. అయితే కొందరు నాయకులు ప్రజలను మాత్రమే వెనక్కి తగ్గాలని కోరుతూ, తమ విషయంలో మాత్రం అదే నిబంధనలు అమలు కాకుండా చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి కార్యక్రమాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వేగాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం వర్గ రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్థానికులు కోరుతున్నారు. అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను పార్టీ అధిష్ఠానం పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల అనంతరం కూడా కొందరు నాయకుల వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తమవుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.
బస్సుల రాక నిలిచిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు..
కేసముద్రం మున్సిపల్ కేంద్రంలోకి ఆర్టీసీ బస్సుల రాక గత కొన్ని నెలలుగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి విస్తరణ పనులు పూర్తికాకపోవడం వల్ల బస్సులు పట్టణంలోకి ప్రవేశించలేకపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రహదారి విస్తరణలో భాగంగా సాధారణ ప్రజల ఇళ్లను తొలగిస్తున్నప్పటికీ, అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు, ఆర్థికంగా బలమైన వ్యక్తుల నిర్మాణాల విషయంలో మాత్రం అదే స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా రహదారి విస్తరణ పనులు పూర్తిస్థాయిలో ముందుకు సాగడం లేదని అంటున్నారు. ముఖ్యంగా ఉప్పరపల్లి రోడ్ మూలమలుపు వద్ద రహదారి ఇరుకుగా ఉండటంతో భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇటీవల మంగళవారం రాత్రి ఓ లారీ అక్కడ ఇరుక్కుపోవడంతో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే మోహన్ టాకీస్ నుంచి గాంధీ సెంటర్ వరకు రహదారి విస్తరణ పనులు ఇంకా ప్రారంభం కాకపోవడం కూడా జాప్యానికి కారణమవుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. రహదారి విస్తరణ పనులను ఎలాంటి వివక్ష లేకుండా వేగంగా పూర్తి చేసి, మున్సిపల్ కేంద్రంలోకి ఆర్టీసీ బస్సుల రాకను పునరుద్ధరించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. అలాగే కేసముద్రం అభివృద్ధి పనులు రాజకీయ విభేదాలకు బలికాకుండా వేగవంతంగా కొనసాగేందుకు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.






