భూముల రీ-సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

by Ratna Kumari |

మిర్యాలగూడ నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న భూముల రీ-సర్వే కార్యక్రమంపై ప్రజలకు అవగాహన

భూముల రీ-సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం
X

దిశ, మాడుగులపల్లి : మిర్యాలగూడ నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న భూముల రీ-సర్వే కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా మాడుగులపల్లి మండలంలోని గండ్రవాణిగూడెం గ్రామాన్ని ఎంపిక చేసి శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఆర్డీవో రమణారెడ్డి పాల్గొని భూముల రీ-సర్వే కార్యక్రమం ఉద్దేశ్యం, అమలు విధానం, ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. రీ-సర్వేతో భూముల సరిహద్దులు స్పష్టంగా నిర్ణయించబడటంతో పాటు భూ రికార్డులు ఆధునికీకరణ చెందుతాయని, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు.

రైతులు, భూ యజమానులు రీ-సర్వే ప్రక్రియకు పూర్తి సహకారం అందించాలని, అధికారులు గ్రామాలకు వచ్చినప్పుడు అవసరమైన భూ పత్రాలను అందించి సరైన వివరాలు నమోదు చేయించుకోవాలని కోరారు. ప్రజల భూ హక్కులను పరిరక్షించడం, భవిష్యత్ తరాలకు వివాదరహిత భూ రికార్డులను అందించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఆర్డీవో రమణారెడ్డి రీ-సర్వే నిర్వహణ విధానం, సాంకేతిక ప్రక్రియ, ప్రజలు పాటించాల్సిన సూచనలపై గ్రామస్తులకు వివరించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సరోజ పావని, సర్పంచ్ బొబ్బలి కావ్య శ్రీను, చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, రైతులు, భూ యజమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story