యూపీ రవాణా రంగంలో నవశకం.. మీరట్ మెట్రో ప్రత్యేకతలు ఇవే

by Malleboina Mahesh |   (  Updated:2026-02-22 10:49:20  IST  )

"ప్రధాని మోదీ చేతులమీదుగా మీరట్ మెట్రో ప్రారంభం! 120kmph వేగంతో ఇది దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో. RRTSతో ట్రాక్ పంచుకోవడం దీని ప్రత్యేకత."

యూపీ రవాణా రంగంలో నవశకం.. మీరట్ మెట్రో ప్రత్యేకతలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లో మెట్రోను ప్రారంభించిన విషయం తెలిసిందే. యూపీ రవాణా ముఖచిత్రాన్ని మారుస్తూ.. మీరట్‌లో అత్యాధునిక 'మీరట్ మెట్రో' అందుబాటులోకి వచ్చింది. శతాబ్ది నగర్ స్టేషన్ వద్ద ప్రధాని మోడీ ఈ మెట్రోను ప్రారంభించి స్వయంగా మెట్రోలో ప్రయాణించి విద్యార్థులు, అధికారులతో ముచ్చటించారు. సుమారు రూ. 12,930 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో భాగంగా ఈ మెట్రో సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రధాని మాట్లాడుతూ, గత పదేళ్లలో దేశంలోని మెట్రో నెట్‌వర్క్ 5 నగరాల నుండి 25 నగరాలకు పైగా విస్తరించిందని, భారత్ నేడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మెట్రో వ్యవస్థగా అవతరించిందని హర్షం వ్యక్తం చేశారు.

మీరట్ మెట్రో సాంకేతిక రికార్డులు

ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం అయిన ఈ మెట్రో ప్రాజెక్టు అనేక సాంకేతిక రికార్డులను సృష్టించింది. గంటకు 120 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే మీరట్ మెట్రో, దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రోగా నిలిచింది. ఇది ఇప్పటివరకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. విశేషమేమిటంటే, ప్రపంచంలోనే తొలిసారిగా రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS), లోకల్ మెట్రో రైళ్లు ఒకే మౌలిక సదుపాయాలను (ట్రాక్స్- స్టేషన్లు) పంచుకుంటూ నడవడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. మీరట్ సౌత్ నుంచి మోదీపురం వరకు ఉన్న 21 కిలోమీటర్ల దూరాన్ని ఈ మెట్రో కేవలం 30 నిమిషాల్లోనే చేరుకుంటుంది.

ప్రయాణికుల సౌకర్యార్థం మీరట్ మెట్రోలో అంతర్జాతీయ స్థాయి వసతులను కల్పించారు. ప్రతి రైలులో మూడు అత్యాధునిక కోచ్‌లు ఉంటాయి. వీటిలో 700 మంది వరకు ప్రయాణించవచ్చు. కోచ్‌లలో మొబైల్ ఛార్జింగ్ (USB) పాయింట్లు, డైనమిక్ రూట్ మ్యాప్స్, అత్యవసర సమయాల్లో అధికారులతో మాట్లాడే సౌకర్యం ఉన్నాయి. భద్రత కోసం ప్రతి స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్ స్క్రీన్ డోర్స్ (PSDs) ఏర్పాటు చేశారు. ఈ మెట్రో ప్రారంభంతో పాటు, ఢిల్లీ నుంచి మీరట్ వరకు ఉన్న 82 కిలోమీటర్ల పూర్తి 'నమో భారత్' కారిడార్ కూడా నేటితో కార్యరూపం దాల్చింది. దీనివల్ల ఢిల్లీ-మీరట్ మధ్య ప్రయాణ సమయం గంటలోపు (సుమారు 55 నిమిషాలు) కుదించబడింది.

మీరట్‌ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోడీ

Next Story