తొలి ఏకాదశి మహోత్సవం.. యోగా లక్ష్మీనరసింహుడి సన్నిధిలో భక్తజన సందోహం!

by Jakkula.Mamatha |

మఠంపల్లి మండల పరిధిలోని మట్టపల్లి గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మట్టపల్లి యోగా లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీ భారీగా నెలకొంది.

తొలి ఏకాదశి మహోత్సవం.. యోగా లక్ష్మీనరసింహుడి సన్నిధిలో భక్తజన సందోహం!
X

దిశ, మఠంపల్లి: మఠంపల్లి మండల పరిధిలోని మట్టపల్లి గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మట్టపల్లి యోగా లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీ భారీగా నెలకొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.తొలి ఏకాదశి సందర్భంగా స్వామి వారికి సుప్రభాత సేవ, అభిషేకం,విశేష అర్చనలు, సహస్ర నామార్చన, ప్రత్యేక అలంకరణ, మహామంగళహారతి నిర్వహించారు. అనంతరం భక్తుల సంక్షేమం, లోక క్షేమం కోసం ప్రత్యేక పూజలు, వేదపారాయణాలు నిర్వహించి స్వామివారికి విశేష నైవేద్యాలు సమర్పించారు.

తొలి ఏకాదశి రోజున శ్రీ యోగా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సంతాన సౌభాగ్యం, విష్ణు కటాక్షం లభిస్తాయని భక్తుల విశ్వాసంగా నమ్ముతారు. ఈ సందర్భంగా,భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక దర్శన క్యూలైన్లు, తాగునీటి సదుపాయం, వైద్య శిబిరం, పారిశుద్ధ్య చర్యలు, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, నిరంతర అన్నప్రసాద వితరణ వంటి ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి మాట్లాడుతూ.. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని శాఖల సమన్వయంతో పటిష్ఠ చర్యలు తీసుకున్నామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మట్టపల్లి ఆలయ ధర్మకర్తలు చెన్నూరి విజయకుమార్,మట్టపల్లి రావు ఆలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Next Story