- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాగులో ‘సాంకేతిక’ విప్లవం
రాష్ట్రంలో వ్యవసాయ రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సాంకేతికతను జోడించి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది.

దిశ, దమ్మపేట : రాష్ట్రంలో వ్యవసాయ రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సాంకేతికతను జోడించి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహించిన వ్యవసాయ శాఖ ఉన్నతస్థాయి సమీక్షలో.. విత్తనాలు నాటడం నుంచి పంట కొనుగోళ్ల వరకు మొత్తం వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ, సివిల్ సప్లయిస్, అగ్రికల్చర్ యూనివర్సిటీలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్ట్) చేపట్టిన ఏఐ ప్రాజెక్టును సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. క్షేత్రస్థాయిలో ఈ ప్రాజెక్టు ఫలితాలను అధ్యయనం చేయాలని, రైతులకు మేలు చేకూరుస్తుంటే రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలోకి తేవాలని స్పష్టం చేశారు. దీంతో దమ్మపేట మండలంలో అమలవుతున్న ఈ నూతన విధానం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అగ్రిబ్రిడ్జ్.. క్రిషివాస్
దమ్మపేట మండలంలో హైదరాబాద్‌కు చెందిన ‘అగ్రిబ్రిడ్జ్’ సంస్థ ‘క్రిషివాస్’ పేరుతో ఈ వినూత్న ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఉపగ్రహ (శాటిలైట్) ఛాయాచిత్రాలు, కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను మేళవించి రైతుల అరచేతిలోనే పంటల స్థితిగతులను ఉంచుతోంది. సాధారణంగా పంటకు రోగం వచ్చి ఆకులు రాలిపోయి, ఎండిపోయి కంటికి కనిపించిన తర్వాతే రైతులు గుర్తిస్తుంటారు. కానీ ఈ యాప్ ద్వారా 5 నుంచి 7 రోజుల ముందుగానే, కంటికి కనిపించని రోగాన్ని పసిగట్టి (ఎర్లీ డిటక్షన్) రైతులకు ముందస్తు హెచ్చరికలు పంపుతారు. ఇది ప్రతిరోజూ ఎకరాకు 444 పాయింట్ల రూపంలో కచ్చితమైన సమయం (రియల్-టైమ్) డేటాను విశ్లేషించి.. వాతావరణం, ఆకు, నేలలోని తేమ శాతాన్ని కచ్చితంగా అంచనా వేస్తుంది.
అనూహ్య స్పందన
దమ్మపేట మండలంలో సుమారు 12,000 మంది రైతులు ఉండగా, వారిలో 7,500 మందికి పైగా స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారు. అయితే ఈ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఏకంగా 5,200 మందికి పైగా రైతులు ఈ క్రిషివాస్ యాప్‌ను తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకుని క్రియాశీలకంగా వాడుతుండటం విశేషం. మండలంలోని 22 రెవెన్యూ గ్రామాల పరిధిలో అన్ని చోట్లా ఈ సాంకేతికతను రైతులు అందిపుచ్చుకుంటున్నారు. కట్కూరు, పూసుకుంట మారుమూల కొండరెడ్ల గిరిజన గ్రామాల్లో సైతం నెట్‌వర్క్ సదుపాయం ఉన్నచోట ఈ ఏఐ టెక్నాలజీ సేవలు అందడం గమనార్హం. ప్రధానంగా మండలంలో ఎక్కువగా సాగయ్యే ఆయిల్ పామ్ తోటల్లో ప్రతి చెట్టునూ శాటిలైట్ ద్వారా పర్యవేక్షించడం రైతులకు ఎంతో ఊరటనిస్తోంది.
కృషి మిత్ర సేవలు
చదువుకోని లేదా స్మార్ట్‌ఫోన్ వాడటం రాని సన్నకారు రైతుల కోసం అగ్రిబ్రిడ్జ్ సంస్థ గ్రామాల్లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక స్థానిక యువకుడిని కృషి మిత్రగా నియమించింది. శాటిలైట్ ద్వారా ఏదైనా పొలంలో సమస్య ఉన్నట్లు గుర్తించిన వెంటనే.. సదరు కృషి మిత్ర నేరుగా ఆ రైతు వద్దకు వెళ్లి, సమస్యను వివరించి, ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలో సూచిస్తాడు. స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో) తోడ్పాటుతో ఈ వ్యవస్థ క్షేత్రస్థాయిలో విజయవంతంగా నడుస్తోంది. ఇక స్పాట్ స్ప్రేయింగ్‌తో ఖర్చు సగానికి తగ్గనుంది. మొత్తం పొలానికి గుడ్డిగా మందులు పిచికారీ చేయడం వల్ల రైతులకు ఆర్థిక భారం పడటంతో పాటు భూసారం దెబ్బతింటోంది. దీనికి చెక్ పెడుతూ, క్రిషివాస్ యాప్.. తోటలో ఏ ప్రాంతంలో, ఏ మొక్కకు సమస్య ఉందో అక్కడికే నేరుగా (నావిగేషన్ ద్వారా) రైతును తీసుకెళ్తుంది. కేవలం ఆ ప్రభావిత ప్రాంతంలోనే మందులు (స్పాట్ స్ప్రేయింగ్) వాడేలా సూచిస్తుంది. పైగా రసాయన మందుల కంటే సేంద్రియ (బయోలాజికల్) పద్ధతులకే ఈ యాప్ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీనివల్ల రైతులకు కూలీల ఖర్చు, మందుల ఖర్చు సగానికి పైగా ఆదా అవుతోంది.
95% కచ్చితత్వం
దమ్మపేటలో ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి ముందే సంస్థ దీని పనితీరును నిర్ధారించుకుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 8 రీసెర్చ్ స్టేషన్లలో శాస్త్రవేత్తలు ఈ టెక్నాలజీని క్షుణ్ణంగా పరీక్షించారు. ఇది 95 శాతానికి పైగా కచ్చితత్వంతో పనిచేస్తుందని తేల్చారు. దమ్మపేట రైతుల సాగులో సక్సెస్ అయిన ఈ కృత్రిమ మేధ ప్రాజెక్ట్ ఫలితాలపై ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇక్కడి ఫలితాల ఆధారంగా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏఐ విధానాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మొత్తానికి రాష్ట్ర వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చే సరికొత్త సాంకేతికతకు దమ్మపేట మండలం ఒక రోల్ మోడల్‌గా నిలవబోతోంది.






