తాతయ్య.. నానమ్మ జ్ఞాపకార్థం విద్యార్థులకు స్వచ్ఛజల కానుక

by Batti.Sumithra |   (  Updated:2026-06-20 16:32:58  IST  )

పెద్దల జ్ఞాపకాలను పదిలపరుస్తూ, విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడే సత్కార్యానికి తిమ్మాపురం గ్రామం వేదికైంది.

తాతయ్య.. నానమ్మ జ్ఞాపకార్థం విద్యార్థులకు స్వచ్ఛజల కానుక
X

దిశ, నేరేడుగొమ్ము : పెద్దల జ్ఞాపకాలను పదిలపరుస్తూ, విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడే సత్కార్యానికి తిమ్మాపురం గ్రామం వేదికైంది. కీర్తిశేషులు ఇప్ప వెంకటరెడ్డి – భగీరథమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి మనవడు ఇప్ప అశోక్‌రెడ్డి, రేణుక దంపతులు తిమ్మాపురం ప్రభుత్వ పాఠశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యాన్ని అందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రవికుమార్ మాట్లాడుతూ తిమ్మాపురం గ్రామ ప్రజలు విద్యాభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుంటారని ప్రశంసించారు. పాఠశాల అభివృద్ధికి గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, దాతలు కలిసి కృషి చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన అశోక్‌రెడ్డి, రేణుక దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.

వాటర్ ప్లాంట్ దాత ఇప్ప అశోక్‌రెడ్డి మాట్లాడుతూ తమ తాతయ్య ఇప్ప వెంకటరెడ్డి, నానమ్మ భగీరథమ్మ జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు అందించిన విలువలను సమాజానికి తిరిగి అందించడమే నిజమైన కృతజ్ఞత అని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుల్లో రాణించి అజ్ఞానాన్ని వీడి విజ్ఞాన మార్గంలో పయనించాలని ఆయన ఆకాంక్షించారు. విజ్ఞానం అంటే పుస్తక జ్ఞానం మాత్రమే కాదని, మంచి ఆలోచనలు, మానవీయ విలువలు, సమాజానికి ఉపయోగపడే అవగాహన, బాధ్యతతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవడమే నిజమైన విజ్ఞానమని అన్నారు. విద్యతో పాటు విలువలు పెంపొందితేనే ఆదర్శవంతమైన పౌరులు తయారవుతారని పేర్కొన్నారు. మనబడి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

పాఠశాలలు అభివృద్ధి చెందితే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని అన్నారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి, రేణుక దంపతులు విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల తమకున్న శ్రద్ధను చాటుతూ స్వచ్ఛమైన నీటితో పాటు పోషకాహారం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ చదువుల్లో మంచి ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిథి నేరేడుగొమ్ము ఎంఈఓ బ్రహ్మచారి మాట్లాడుతూ ఆహారం ఎంత ముఖ్యమో స్వచ్ఛమైన తాగునీరు కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ఈ వాటర్ ప్లాంట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ స్వాతిముత్యం, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని అశోక్‌రెడ్డి దంపతులను అభినందించారు. వారి సేవా కార్యక్రమం గ్రామంలో ఆదర్శంగా నిలుస్తుందని పలువురు ప్రశంసించారు.

Next Story