ఈఎంఐలు కట్టే వారికి బిగ్ షాక్ తప్పదా..?

by Malleboina Mahesh |

పశ్చిమాసియా యుద్ధం వల్ల ద్రవ్యోల్బణం పెరిగి దీపావళి నాటికి ఆర్బీఐ రెపో రేట్లు పెంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనితో హోమ్, వెహికల్ లోన్ ఈఎంఐలు భారం కానున్నాయి.

ఈఎంఐలు కట్టే వారికి బిగ్ షాక్ తప్పదా..?
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా (Middle East) లో ఏర్పడిన సంక్షోభం కారణం అన్ని వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయంగా ఇంధన సరఫరా దెబ్బతినడం, దేశీయంగా ద్రవ్యోల్బణం (Inflation) పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ అంతర్జాతీయ యుద్ధ వాతావరణం దేశీయ మార్కెట్లను ఎలా ప్రభావితం చేయబోతోందనే అంశంపై ఆర్థిక విశ్లేషకులు విడుదల చేసిన తాజా నివేదికలు భారతదేశంలో ఈఎంఐలు కట్టే వారికి షాక్ తప్పదని అంచనా వేస్తున్నారు.

ఇరాన్ సంక్షోభం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil), సహజ వాయువు (Gas) కొరత ఏర్పడి వాటి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. భారతదేశం తన చమురు అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడటంతో.. రవాణా ఖర్చులు పెరిగి హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (WPI - టోకు ధరల సూచీ) భారీగా ఎగబాకుతోంది. ఇది పరోక్షంగా నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. దీంతో పెరుగుతున్న ఈ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కఠిన చర్యలు తీసుకోక తప్పదని నిపుణులు భావిస్తున్నారు.

రాబోయే దీపావళి పండుగ నాటికి ఆర్బీఐ తన ద్రవ్య పరపతి సమీక్షలో కీలక వడ్డీ రేట్లను (Repo Rates) పెంచే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఆర్బీఐ రెపో రేటును పెంచితే.. బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను పెంచుతాయి. ఫలితంగా కొత్తగా లోన్లు తీసుకునే వారికి వడ్డీ భారం పెరగడంతో పాటు.. ఇప్పటికే లోన్లు తీసుకున్న మధ్యతరగతి ప్రజల హోమ్ లోన్ (ఇంటి రుణాలు), వెహికల్ లోన్ (వాహన రుణాలు), పర్సనల్ లోన్ల (వ్యక్తిగత రుణాలు) ఈఎంఐలు (EMIs) భారీగా పెరగనున్నాయి. అంతర్జాతీయ సరఫరా గొలుసు (Supply Chain) పునరుద్ధరించబడకపోతే, పండుగల సీజన్ నాటికి సామాన్య ప్రజల బడ్జెట్‌పై ఈ ద్రవ్యోల్బణ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Next Story