నిమ్మకాయలు బస్తా రూ.10 వేలు

by Muthe.Rajitha |

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శుక్రవార నాడు నిమ్మకాయల ధరలు ఆల్ టైం హై రికార్డులను నమోదు చేసాయి.

నిమ్మకాయలు బస్తా రూ.10 వేలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పొదలకూరు నిమ్మ మార్కెట్‌లో శుక్రవార నాడు నిమ్మకాయల ధరలు ఆల్ టైం హై రికార్డులను నమోదు చేసాయి. గత కొన్నాళ్లుగా గిట్టుబాటు ధర లేక అల్లాడిపోయిన నిమ్మ రైతులకు ఈ తాజా ధరలు పెద్ద ఊరటనిచ్చాయి. వేసవి తీవ్రత పెరగడం, ఉత్తరాది రాష్ట్రాల నుండి ఆర్డర్లు వెల్లువెత్తడంతో 80 కిలోల నిమ్మ బస్తా ధర రికార్డు స్థాయిలో రూ. 10,000 మార్కును తాకింది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. నాణ్యమైన కాయలు ఉన్న బస్తా రూ. 8,000 నుండి రూ. 10,000 వరకు పలుకుతుండగా, సగటున కిలో నిమ్మకాయల ధర రూ. 100 నుండి రూ. 125 మధ్య ఉంటోంది.

ఎండల తీవ్రత పెరగడం, దిగుబడి తగ్గడం ఈ పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. కేవలం కొన్ని నెలల క్రితం వరకు ఇదే బస్తా ధర రూ. 500 నుండి రూ. 2,000 లోపే ఉండటంతో, రవాణా ఖర్చులు కూడా రాక రైతులు కాయలను చెట్లపైనే వదిలేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో పొదలకూరు, గూడూరు, సైదాపురం ప్రాంతాల్లోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రిటైల్ మార్కెట్‌లో ఒక్కో నిమ్మకాయ ధర రూ. 10 నుండి రూ. 15 వరకు పలుకుతుండటం సామాన్య వినియోగదారులకు భారంగా మారింది. రాబోయే మే నెలలో ఎండలు మరింత ముదిరితే, ఈ ధరలు మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

Next Story