6G కేవలం సాంకేతికత కాదు.. మానవ సామర్థ్యానికి సరికొత్త ఉత్ప్రేరకం: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

by Malleboina Mahesh |

6G అనేది కేవలం సాంకేతికత మాత్రమే కాదు, మానవ సామర్థ్యాల సరికొత్త ముందడుగు అని, గ్లోబల్ 6G ప్రమాణాల రూపకల్పనలో భారత్ కీలకం అని మంత్రి సింధియా తెలిపారు.

6G కేవలం సాంకేతికత కాదు.. మానవ సామర్థ్యానికి సరికొత్త ఉత్ప్రేరకం: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
X

దిశ, వెబ్ డెస్క్: టెలికాం రంగంలో 6G సాంకేతికతపై కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Minister Jyotiraditya Scindia)కీలక వ్యాఖ్యలు చేశారు. 6G సాంకేతికత కేవలం తదుపరి తరం నెట్‌వర్క్ మాత్రమే కాదని, అది మానవ సామర్థ్యాలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లే ఒక గొప్ప ముందడుగు అని మంత్రి పేర్కొన్నారు. బుధవారం (మార్చి 18, 2026) ఢిల్లీలో జరిగిన 'ఇంటర్నేషనల్ వర్క్‌షాప్ ఆన్ 6G స్టాండర్డైజేషన్' ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. గ్లోబల్ 6G ప్రమాణాలను రూపొందించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని, మన 'డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' (DPI), 'భారత్ 6G విజన్' దీనికి వెన్నెముకగా నిలుస్తాయని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.

ఈ సందర్భంగా మంత్రి కొన్ని ఆసక్తికర గణాంకాలను పంచుకున్నారు. గత పదేళ్లలో భారత్‌లో డేటా ధరలు 97 శాతం మేర తగ్గాయని, ఒకప్పుడు రూ. 290 గా ఉన్న ఒక జీబీ డేటా ధర ప్రస్తుతం రూ. 8 కి చేరిందని తెలిపారు. నెలకు సుమారు 20 బిలియన్లకు పైగా యూపీఐ (UPI) లావాదేవీలతో ప్రపంచ డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌లో భారత్ అగ్రగామిగా ఉందని గుర్తుచేశారు. 2030 నాటికి 6G టెక్నాలజీని వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా 'భారత్ 6G అలయన్స్' ద్వారా స్వదేశీ పరిశోధనలు ముమ్మరం చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ టెక్నాలజీ కేవలం ఇంటర్నెట్ వేగాన్ని పెంచడమే కాకుండా.. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుందని ఈ సందర్భంగా కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ధీమా వ్యక్తం చేశారు.

Next Story