పేదలకు పండగలాంటి వార్త.. రేపటి నుంచే 62 కొత్త ‘అన్న క్యాంటీన్లు’ ప్రారంభం

by Malleboina Mahesh |

ఏపీలో 62 కొత్త అన్న క్యాంటీన్లు ప్రారంభం! రేపటి నుంచి 269 సెంటర్లలో ₹5కే భోజనం. ధరణికోటలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.

పేదలకు పండగలాంటి వార్త.. రేపటి నుంచే 62 కొత్త ‘అన్న క్యాంటీన్లు’ ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో మరో కీలక అడుగు వేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా నిర్మించిన 62 అన్న క్యాంటీన్లను ఈ నెల (ఏప్రిల్) 15వ తేదీన ప్రభుత్వం ప్రారంభించనుంది. పల్నాడు జిల్లా ధరణికోటలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. గతంలో అందుబాటులో ఉన్న 207 క్యాంటీన్లకు అదనంగా ఇవి తోడవడంతో, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం అన్న క్యాంటీన్ల సంఖ్య 269కి చేరనుంది.

₹5కే కడుపు నిండా భోజనం..

ఈ క్యాంటీన్ల ద్వారా కేవలం 5 రూపాయలకే నాణ్యమైన టిఫిన్, భోజనాన్ని అందిస్తున్నారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా సుమారు 8.80 కోట్ల మంది లబ్ధి పొందగా, ప్రస్తుతం ప్రతి రోజూ సగటున 2.10 లక్షల మంది అన్న క్యాంటీన్లలో భోజనం చేస్తున్నారని ప్రభుత్వం వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు, పేదలు, ప్రయాణికులకు ఈ కొత్త క్యాంటీన్లు ఎంతో ఊరటనివ్వనున్నాయి. ఆహార భద్రతలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story