అన్నీ అనుకున్నట్లు జరిగితే మే నెలలో 5జీ స్పెక్ట్రమ్ వేలం: టెలికాం విభాగం!

by Web Desk |
అన్నీ అనుకున్నట్లు జరిగితే మే నెలలో 5జీ స్పెక్ట్రమ్ వేలం: టెలికాం విభాగం!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ఈ ఏడాదిలోపు 5జీ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా 5జీ స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించి ప్రక్రియ మే నాటికి నిర్వహించే అవకాశం ఉందని టెలికాం విభాగానికి చెందిన అధికారి తెలిపారు. 'దేశీయ టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించిన సిఫార్సులను మార్చి చివరి నాటికి పంపించవచ్చని, ఆ తర్వాత మే సమయానికి వేల కోసం ఇతర పనులు పూర్తవుతాయని' టెలికాం కార్యదర్శి కె రాజారామన్ అన్నారు. అలాగే వేలం ప్రక్రియను వేగవంతం చేసేందుకు టెలికాం విభాగం సిద్ధంగా ఉందని, ఇదివరకు ట్రాయ్ సిఫార్సులు పంపించిన అనంతరం 60-120 రోజులకు వేలం నిర్వహణ జరిగేది. అయితే, ఈసారి ట్రాయ్ నుంచి సిఫార్సులు వచ్చిన రెండు నెలల్లోనే టెలికాం విభాగం దీన్ని పూర్తి చేయనుందని ఆయన వివరించారు. వేలం ప్రక్రియకు సంబంధించి స్పెక్ట్రమ్ ధరలు, బ్లాక్ సైజ్, కేటాయింపు, చెల్లింపుల నిబంధనల గురించి టెలికాం విభాగం(డీఓటీ) ట్రాయ్ నుంచి సిఫార్సులను ఆహ్వానిస్తుంది. ఆ తర్వాత ట్రాయ్ పరిశ్రమ, ఇతర భాగస్వామ్యులతో చర్చించిన తర్వాత డీఓటీకి ప్రతిపాదనలు వెళ్తాయి. దీనిపై డీఓటీ నిర్ణయం తీసుకున్న తర్వాత కేబినెట్ ఆమోదానికి పంపిస్తారు. ఆ తర్వాతే వేలం ప్రక్రియను నిర్వహించనున్నారు. అన్ని ప్రక్రియలు అనుకున్న సమయానికి పూర్తయితే 5జీ సేవలు ఈ ఏడాదిలోపు అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల 4జీ నెట్‌వర్క్ కంటే 10 రెట్ల వేగంతో 5జీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.



Next Story