తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి.. ఒక్క రోజులోనే 56 మంది మృతి

by Malleboina Mahesh |

తెలుగు రాష్ట్రాల్లో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బతో తెలంగాణలో 40 మంది, ఏపీలో 16 మంది మరణించారు.

తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి.. ఒక్క రోజులోనే 56 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఓ వైపు ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికి.. మరో వైపు తెలుగు రాష్ట్రాలను భానుడి భగభగలు వణికిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలను ముంచెత్తుతున్న వడగాడ్పుల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. పలు ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌ నమోదవుతుండటంతో ఎండల తీవ్రతకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గడిచిన 24 గంటల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వడదెబ్బ (Heatstroke) కారణంగా మొత్తం 56 మంది మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇందులో ఒక్క తెలంగాణలోనే అత్యధికంగా 40 మంది ప్రాణాలు కోల్పోగా, ఆంధ్రప్రదేశ్‌లో 16 మంది వడదెబ్బకు బలయ్యారు.

జిల్లాల వారీగా మరణాల వివరాలను పరిశీలిస్తే, తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా 19 మంది మృతి చెందారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో ఆరుగురి చొప్పున ప్రాణాలు కోల్పోగా, ఆదిలాబాద్‌లో ఇద్దరు, నిజామాబాద్‌లో ఒకరు మరణించారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎండల తీవ్రతకు గుంటూరు, పల్నాడు, విజయవాడ, అనకాపల్లి, ఏలూరు తదితర జిల్లాల్లో మరణాలు నమోదయ్యాయి. ఈ ఘోర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట ఇళ్ల నుంచి బయటకు రావద్దని, తగినన్ని ద్రవాహారాలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ఇరు రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

Next Story