4 బస్సులు ఢీ.. 26 మందికి గాయాలు

by Muthe.Rajitha |

అర్థరాత్రి రాజమండ్రిలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది.

4 బస్సులు ఢీ.. 26 మందికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్ : అర్థరాత్రి రాజమండ్రిలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. రాజమండ్రిలోని దివాన్‌చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థులతో ఉన్న రెండు బస్సులు, మరో రెండు ట్రావెల్‌ బస్సులను ఢీకొనడంతో 26 మంది పిల్లలు గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా దిండి ప్రాజెక్టు సమీపంలోని గుండ్లపల్లి మోడల్‌ ప్రభుత్వ పాఠశాల, కళాశాలకు చెందిన 9వ, 10వ తరగతి మరియు ఇంటర్‌ విద్యార్థులు విహారయాత్రకు వెళ్లారు. 90 మంది బాలబాలికలు, టీచర్లు, సిబ్బంది సహా రెండు బస్సుల్లో అరకు, పాడేరు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు పర్యటించి మంగళవారం అర్ధరాత్రి తర్వాత రాజమండ్రి వెళ్తున్నారు. అయితే దివాన్‌చెరువు దగ్గర ఓ గేదె రోడ్డుకు అడ్డుగా రావడంతో ముందు వెళ్తున్న ట్రావెల్‌ బస్సు డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశాడు.

దీంతో వెనుక వస్తున్న విద్యార్థుల రెండు బస్సులు, మరో ట్రావెల్‌ బస్సు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ఉన్న 26 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను మూడు అంబులెన్స్‌లలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులను దివాన్‌చెరువులోని బాలవికాస్‌ మందిరానికి తరలించారు.

Next Story