- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిమ్స్‌కు 16 సూపర్ స్పెషాలిటీ సీట్లు... ఎన్ఎమ్‌సి గ్రీన్ సిగ్నల్
నిమ్స్‌లో మరో అరుదైన మైలురాయి! ఆంకో పాథాలజీ సహా 4 విభాగాల్లో 16 సూపర్ స్పెషాలిటీ సీట్లకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది. క్యాన్సర్ చికిత్సలో ఇది కీలక మలుపు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థ నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. నాలుగు సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఎంసీహెచ్, డీఎం కోర్సుల నిర్వహణకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేసినట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప శనివారం వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్య సంస్థల చరిత్రలోనే తొలిసారిగా ఆంకో పాథాలజీ విభాగంలో డీఎం సూపర్ స్పెషాలిటీ కోర్సును ప్రారంభించే గౌరవం నిమ్స్‌కు దక్కింది. క్యాన్సర్ నిర్ధారణ, వర్గీకరణ, చికిత్స పర్యవేక్షణలో అత్యంత కీలకమైన ఈ విభాగంలో నిపుణుల శిక్షణ అందుబాటులోకి రావడం రాష్ట్ర వైద్య రంగానికి పెద్ద ఊరటనిచ్చే అంశం.
అనుమతి పొందిన విభాగాలు - సీట్ల వివరాలు
సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఎం.సీహెచ్) 4 సీట్లు, వాస్క్యులర్ సర్జరీ (ఎం.సీహెచ్) 4 సీట్లు, సర్జికల్ ఆంకాలజీ (ఎం.సీహెచ్) 4 సీట్లు, ఆంకో పాథాలజీ (డీఎం): 4 సీట్లు ... మొత్తం మొత్తం 16 సూపర్ స్పెషాలిటీ సీట్లు మంజూరయ్యాయి.
క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు..
ఆంకో పాథాలజీ విభాగంలో అత్యాధునిక సాంకేతికతలైన మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్, జెనోమిక్ ప్రొఫైలింగ్, సైటోజెనెటిక్స్ వంటి పద్ధతుల ద్వారా క్యాన్సర్‌ను ఖచ్చితంగా నిర్ధారించే అవకాశం లభిస్తుంది. ప్రెసిషన్ ఆంకాలజీ యుగంలో రోగికి తగిన లక్ష్యిత చికిత్స (టార్గెటెడ్ థెరపి) అందించడంలో ఆంకో పాథాలజిస్టుల పాత్ర ఎంతో కీలకమని ప్రొఫెసర్ బీరప్ప పేర్కొన్నారు. పెరుగుతున్న క్యాన్సర్ బాధితుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ రంగంలో ఇటువంటి ఉన్నత స్థాయి శిక్షణ అందుబాటులోకి రావడం వల్ల భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన నిపుణులు ప్రజలకు అందుబాటులోకి వస్తారని డైరెక్టర్ తెలిపారు. నిమ్స్‌లో ఉన్న ఆధునిక మౌలిక వసతులు మరియు విద్యా నైపుణ్యానికి ఈ గుర్తింపు నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.
- Tags
- NIMS






