- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2026: వారికి ఆర్సీబీ అరుదైన నివాళి.. స్టేడియంలో 11 సీట్లు ఎప్పటికీ ఖాళీ
ఆర్సీబీ అరుదైన నివాళి; గత ఏడాది టైటిల్ వేడుకల తొక్కిసలాటలో చనిపోయిన 11 మంది అభిమానుల కోసం చిన్నస్వామి స్టేడియంలో 11 సీట్లను శాశ్వతంగా ఖాళీగా ఉంచాలని నిర్ణయం.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. 2025 సీజన్ లో ఆర్సీబీ కప్ గెలిచినప్పటికీ విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాట తీరని దు:ఖాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై అనేక రోజులు వివాదం కొనసాగగా.. ఈ సీజన్ లో మ్యాచుల నిర్వాహనే ప్రశ్నార్థకంగా మారింది. చివరికి ప్రభుత్వం దిగొచ్చి చిన్న స్వామి స్డేడియంలోనే ఆర్సీబీ మ్యాచులు నిర్వహిస్తామని ప్రకటించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తమ ప్రాణాలకు ప్రాణమిచ్చే అభిమానుల పట్ల అత్యంత మానవీయమైన రీతిలో స్పందించింది.
గత ఏడాది జూన్ 4న బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఊహించని రీతిలో తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది అభిమానుల జ్ఞాపకార్థం ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నాయి. చిన్నస్వామి స్టేడియంలోని ఒక స్టాండ్‌లో 11 సీట్లను శాశ్వతంగా రిజర్వ్ చేసి, వాటిని ఎవరికీ విక్రయించకుండా ఎప్పుడూ ఖాళీగా ఉంచాలని నిర్ణయించారు. తద్వారా ఆ 11 మంది అభిమానులు ప్రతి మ్యాచ్‌లోనూ భౌతికంగా కాకపోయినా, ఆ సీట్లలో ఉండి జట్టును ప్రోత్సహిస్తూనే ఉంటారని ఆర్సీబీ భావిస్తోంది.
ఈ నివాళి లో భాగంగా స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద మరణించిన వారి పేర్లతో కూడిన ఒక స్మారక ఫలకాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో భాగంగా మార్చి 28న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనున్న వేళ, ఈ స్మారక ఫలకాన్ని ఆవిష్కరించి ఒక నిమిషం పాటు మౌనం పాటించనున్నారు. కేవలం ఐపీఎల్ మ్యాచ్‌లే కాకుండా, చిన్నస్వామి స్టేడియంలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ ఈ 11 సీట్లు ఖాళీగానే ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. "గెలుపు ఆనందాన్ని పంచుకోవడానికి వచ్చి తిరిగి రాని లోకాలకు వెళ్లిన ఆ అభిమానులు ఎప్పటికీ మా గుండెల్లోనే ఉంటారు" అని కేఎస్‌సీఏ ప్రతినిధులు భావోద్వేగంగా పేర్కొన్నారు.






