6జీ టెక్నాలజీపై పరిశోధనలు ప్రారంభిస్తున్న కేంద్రం

by  |

దిశ, వెబ్‌డెస్క్: త్వరలో దేశవ్యాప్తంగా కొత్త టెక్నాలజీ 5జీ నెట్‌వర్క్ రానున్న సంగతి తెలిసిందే. అయితే, కేంద్రం 5జీ ప్రారంభం కాకమునుపే 6జీ నెట్‌వర్క్‌కు సంబంధించి పరిశోధనలు ప్రారంభించాలని భావిస్తోంది. తాజాగా, ప్రభుత్వ యాజమాన్య టెలికాం పరిశోధనా, అభివృద్ధి సంస్థ సీ-డీఓటీని టెలికాం విభాగం సెక్రటరీ కె రాజరామన్ 6జీపై పనులు ప్రారంభించాలని కోరారు. అంతర్జాతీయ మార్కెట్‌ని సకాలంలో అందుకునేందుకు 6జీ, ఇతర భవిష్యత్తు టెక్నాలజీలపై పని చేయడం ప్రారంభించాలని అన్నారు. ఇప్పటికే శాంసంగ్, ఎల్‌జీ సహా ఇతర గ్లోబల్ కంపెనీలు 6జీ టెక్నాలజీపై పరిశోధనలు మొదలుపెట్టాయి. 6జీ టెక్నాలజీ 5జీ కంటే ఏకంగా 50 రెట్లు వేగవంతంగా ఉంటుందని, 2028-2030 నాటికి కమర్షియల్ వినియోగానికి అందుబాటులో వస్తుందని అంచనా. ప్రస్తుతం లెక్కల ప్రకారం 5జీ గరిష్ఠ డౌన్‌లోడ్ వేగం సెకనుకు 20జీబీగా ఉంటుంది. అయితే, వొడాఫోన్ ఐడియా సంస్థ భారత్‌లో ఇటీవల జరిపిన పరీక్షలో అత్యధికంగా 3.7 జీబీ డౌన్‌లోడ్ వేగాన్ని నమోదు చేసింది. టెలికాం విభాగం సెక్రటరీగా గత వారమే బాధ్యతలు తీసుకున్న కె రాజరామన్ టెక్నాలజీ కమర్షియలైజ్ చేయడంపై దృష్టి సారించారు. అమెరికా, చైనా లాంటి దేశాలు 6జీపై పరిశోధనలు ప్రారంభించాయని, ఆయా దేశాలతో పోటీగా కొత్త టెక్నాలజీపై పనిచేయాలని అన్నారు.

Next Story

Most Viewed