సంచలనంగా మారిన బర్రెలక్క మేనిఫెస్టో

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-11-22 13:06:41  IST  )

ఎన్ని డిగ్రీలు చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని అందుకే బర్లు కాసుకుంటున్నానని వీడియో తీసి అప్పట్లో సంచలనం సృష్టించింది శిరీష.

సంచలనంగా మారిన బర్రెలక్క మేనిఫెస్టో
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్ని డిగ్రీలు చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని.. అందుకే బర్లు కాసుకుంటున్నానని వీడియో తీసి అప్పట్లో సంచలనం సృష్టించింది శిరీష. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్‌ గ్రామానికి చెందిన శిరీష తన వీడియోతో అప్పట్లో ప్రభుత్వానికి పెద్ద సవాల్ విసిరినట్టు అయింది. ఆ వీడియో ఆధారంగా అటు ప్రతిపక్షాలు, ఇటు నిరుద్యోగులు ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. దీంతో ఆమె ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోయింది. అప్పటి నుంచి శిరీషను బర్రెలక్కగా పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె నిరుద్యోగుల పక్షాన కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా బరిలోకి దిగింది. ప్రచారంలో దూసుకుపోతున్న బర్రెలక్కకు సోషల్ మీడియా, యూట్యూబర్స్ స్వచ్ఛందంగా ప్రచారం చేస్తూ చేయూతనిస్తున్నారు. ముందు లైట్‌గా తీసుకున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం ప్రస్తుతం ఆమెకు వస్తున్న ఆదరణను చూసి భయపడిపోయే స్థితికి వచ్చారు.

కాగా, స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన శిరీష అలియాస్ బర్రెలక్క తన మేనిఫెస్టోను ప్రకటించింది. నిరుద్యోగులే లక్ష్యంగా ఆమె తన మేనిఫెస్టోను రూపొందించింది. ఉద్యోగాల కల్పన, విద్యా, వైద్యానికి పెద్దపీట వేసింది బర్రెలక్క. ఏడు ప్రధాన అంశాలతో మేనిఫెస్టోను రూపొందించి ప్రధాన పార్టీలకు సవాల్ విసిరింది. బర్రెలక్క మేనిఫెస్టోలో ఏం ఏం అంశాలు ఉన్నాయంటే..

1. నిరుద్యోగుల అంశంపై అసెంబ్లీలో ప్రశ్నిస్తా. సరైన సమయంలో నోటిఫికేషన్లు వచ్చేలా నిలదీస్తా.

2. పేదలకి ఇండ్ల నిర్మాణం కోసం కృషి చేస్తా

3. ఆర్టికల్ 41 ప్రకారం నిరుద్యోగులకు భృతి ఇప్పిస్తా

4. ప్రతి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు

5. ఉచిత విద్య, వైద్యం కోసం పాటుపడుతా

6. నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సులు – ఫ్రీ కోచింగ్

7. యువత ఉన్నత చదువులకు ఫ్రీ కోచింగ్

Next Story