బర్రెలక్కకు సర్పంచ్ నవ్య మద్దతు.. స్టేషన్ ఘన్‌పూర్ స్వతంత్ర అభ్యర్థినిగా ప్రచారం చేస్తూనే..

by Bhoopathi Nagaiah |

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ శిరీష అలియాస్ బర్రెలక్కకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది.

బర్రెలక్కకు సర్పంచ్ నవ్య మద్దతు.. స్టేషన్ ఘన్‌పూర్ స్వతంత్ర అభ్యర్థినిగా ప్రచారం చేస్తూనే..
X

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ శిరీష అలియాస్ బర్రెలక్కకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ప్రచారంలో ఆమె తమ్ముడిపై దాడి జరగడంతో బర్రెలక్కకు సపోర్ట్‌గా రాజకీయ ప్రముఖులతోపాటు నిరుద్యోగులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వస్తున్నారు. ఆమె తరుఫున కోల్లాపూర్‌లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఊపుని చూసి నాగర్ కర్నూల్ జిల్లా రాజకీయాల్లో అలజడి మొదలైంది. అటు అభ్యర్థులు సైతం కలవరపాటుకు గురవుతున్నారు. తాజాగా బర్రెలక్కకు మద్దతుగా స్టేషన్ ఘన్‌పూర్ స్వతంత్ర అభ్యర్థి, జానకీపురం సర్పంచ్ నవ్య మద్దతుగా నిలిచారు. ఆమె తరుఫున ప్రచారం చేయడానికి జనగాం జిల్లా నుంచి నాగర్ కర్నూల్ జిల్లాకు పయనమైంది.

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యపై వేధింపుల ఆరోపణలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యారు సర్పంచ్ నవ్య. తాజాగా ఆమె స్టేషన్ ఘన్‌పూర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమె తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తూనే మరోవైపు బర్రెలక్కకు మద్దతు తెలుపుతూ ఆమె కోసం ప్రచారం చేయడానికి పూనుకున్నారు. గురువారం ఉదయం జానకీపురం నుంచి తన అనుచరులతో కలిసి కొల్లాపూర్ బయలుదేరి వెళ్లిపోయారు నవ్య. ఈ సందర్భంగా సర్పంచ్ నవ్య మాట్లాడుతూ నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు ముందుకు వచ్చిన బర్రెలక్కకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఆమె తరుఫున ప్రచారం చేస్తున్నానన్నారు. బర్రెలక్కకు కేవలం నిరుద్యోగులు, యువత మాత్రమే కాదు.. అభివృద్ధి కాముకులు, ఉద్యోగులు, మేధావులు, ప్రజలు సపోర్ట్ చేసి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. బర్రెలక్కను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించాలని అభ్యర్థించారు.

Next Story