అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల ఫోకస్!

by Disha Web Desk 2 |
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల ఫోకస్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీల్లోనే కాకుండా అధికారుల స్థాయిలోనూ రకరకాల చర్చలు మొదలయ్యాయి. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లుగా, ఎస్పీలు పరస్పరం వారివారి జిల్లాల్లోని పొలిటికల్ అంశాలను షేర్ చేసుకుంటున్నారు. ‘మీ జిల్లాలో ట్రెండ్ ఎలా ఉన్నది?.. ఏ పార్టీ గ్రాఫ్ ఎలా ఉన్నది?.. ఏ పార్టీకి ఎడ్జ్ ఎక్కువగా ఉన్నది?’.. ఇలాంటి చర్చలు వారి మధ్య నడుస్తున్నాయి. హెచ్ఓడీలు, వివిధ డిపార్టుమెంట్ల సెక్రటరీలకు ఫీల్డ్‌లోని పరిస్థితులు పూర్తిస్థాయిలో తెలిసే అవకాశం లేదు. దీంతో ఆసక్తి కొద్దీ కలెక్టర్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. జనం ఆలోచనల్లో వచ్చిన మార్పు, పార్టీల గ్రాఫ్ పెరగడం, తగ్గడంపై వారి అభిప్రాయాలను హైదరాబాద్‌లోని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లతో పంచుకుంటున్నారు.

ప్రత్యామ్నాయంపైనే ప్రజల్లో టాక్

కర్నాటక ఎలక్షన్ రిజల్ట్ వరకూ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లలో పొలిటికల్ అంశంపై పెద్దగా ఆసక్తి లేదు. చర్చలు కూడా తక్కువ. కానీ.. నెల రోజులుగా ప్రజల్లో ఓపెన్‌గా కామెంట్లు వస్తుండడంతో అవి ఆఫీసర్ల చెవుల్లో పడుతున్నాయి. ప్రజావాణి, ప్రభుత్వ ప్రోగ్రామ్‌ల సందర్భంగా హాజరవుతున్న ప్రజల మధ్య జరిగే చర్చలు ఆఫీసర్లకు ఆసక్తి పుట్టించాయి. ఎక్కువ మంది జిల్లా కలెక్టర్లు కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సచివాలయంలోని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. గతంలో ప్రజల మధ్య ఇలాంటి ఓపెన్ చర్చలు జరిగేవి కావని ఓ కలెక్టర్ వెల్లడించిన అభిప్రాయాన్ని సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న మరో సీనియర్ అధికారి ఉదహరించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు అనుకూలంగా వినిపిస్తున్న మౌత్ పబ్లిసిటీ తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ ఉన్నట్లు పేర్కొన్నారు. అటు లోకల్ పోలీసుల ద్వారానూ హైదరాబాద్‌లోని ఐపీఎస్ ఆఫీసర్లకు సేమ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.

ఫీడ్ బ్యాక్‌ బాగోలేకనే వరాల జల్లు

స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వ అధికారుల నుంచి ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకుంటున్నారు. కేసీఆర్‌తోనూ ఇటీవల పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వారివారి జిల్లాలు, సెగ్మెంట్లలోని తాజా పరిస్థితిని షేర్ చేశారు. అటు ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్టు.. ప్రజాప్రతినిధుల ఫీడ్ బ్యాక్ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే.. ఆసరా పింఛన్ల పెంపు, పోడు భూములు, గృహలక్ష్మి, చేతివృత్తులకు చేయూత, డైట్ చార్జీల పెంపు, వీఆర్ఏల రెగ్యులరైజేషన్, పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణకు దిగారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓ వైపు కాంగ్రెస్ గ్రాఫ్‌ను కట్టడి చేయడం, బీఆర్ఎస్‌కు మైలేజ్ తెచ్చుకోవడం ఇప్పుడు కేసీఆర్ ముందున్న సవాల్‌గా చెబుతున్నారు.

Next Story

Most Viewed