‘ఆ రెండు పార్టీలకు కర్రు కాల్చివాత పెట్టడం ఖాయం’

by Disha Web Desk 2 |
‘ఆ రెండు పార్టీలకు కర్రు కాల్చివాత పెట్టడం ఖాయం’
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రజలు కర్రు కాల్చివాత పెట్టడం ఖాయమని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ అన్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ సాధించి, మరోసారి సీఎం కావడానికి మరో 50 రోజులు మాత్రమే ఉన్నాయని అన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధే బీఆర్ఎస్‌ను గెలిపిస్తుందన్నారు. దశాబ్ద కాలంలో తెలంగాణ ప్రతి రంగంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని వివరించారు. 50 ఏండ్లు రాష్ట్రానికి ఏం చేయని కాంగ్రెస్ ఇప్పుడు అమలు కానీ గ్యారంటీలతో ప్రజల ముందుకు వస్తుందన్నారు. గతంలో తెలంగాణకు ఏం చేశారో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారో చెప్పుకోలేని స్థితిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని మండిపడ్డారు.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి, సాగునీరు అందించి రైతుబంధుగా నిలిచారన్నారు. పెట్టుబడి సాయంగా ఎకరాకు 10 వేల చొప్పున ఆర్థికసాయం అందజేసినట్లు వివరించారు. బీసీ చేతి వృత్తుల వారికి ఆర్థికసాయం కేసీఆర్ చేస్తే అదే పథకాన్ని పీఎం విశ్వకర్మ పేరుతో ప్రవేశపెట్టిన మాట నిజం కాదా? అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. రూ. 2 వేలు పెన్షన్, దళిత బంధు పేరుతో రూ.10 లక్షల ఆర్థికసాయం అందజేస్తున్నారన్నారు. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు కళ్లు మండుతున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలో తెలంగాణలో చెప్పిన 6 గ్యారంటీలు ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. ఛత్తీస్ ఘడ్‌లో ఎందుకు గిరిజనులకు పోడు పట్టాలు అందజేయలేదన్నారు. అధికారంలోకి రాడం కష్టమని తెలిసే కాంగ్రెస్‌ నేతలు నోటికొచ్చినట్లు హామీలు ఇస్తున్నారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు ప్రాజెక్టుల్లో ఒక్కదానికి కూడా జాతీయ హోదా ఇవ్వలేదని, విభజన హామీలు అమలు చేయలేదని, పసుపు బోర్డు కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేస్తారో అనే విషయం కూడా బీజేపీ చెప్పడం లేదని మండిపడ్డారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed