ప్రధాని సభకు కీలక నేతలు డుమ్మా.. శంషాబాద్ నుంచే రిటర్న్ అయిన మరో నేత?

by Disha Web Desk 2 |
ప్రధాని సభకు కీలక నేతలు డుమ్మా.. శంషాబాద్ నుంచే రిటర్న్ అయిన మరో నేత?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ సభకు పలువురు బీజేపీ సీనియర్లు డుమ్మా కొట్టారు. పాలమూరులో నిర్వహించిన సభకు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి గైర్హాజరయ్యారు. ఇక మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి శంషాబాద్ విమానాశ్రయంలో మోడీకి స్వాగతం పలికి అక్కడి నుంచే రిటర్న్ అయ్యారు. పాలమూరు సభకు వెళ్లలేదు. ఆయనతో పాటు మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, ఏనుగు రవీందర్ రెడ్డి సైతం ఈ సభకు అటెండ్ అవ్వలేదు. వారు హాజరుకాకపోవడం వెనుక ఉద్దేశమేంటనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఇటీవల పలువురు అసంతృప్తులు రహస్యంగా పలు దఫాలుగా భేటీ అయ్యారు. అందులో వీరు కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తిరుగుబాటు నేతలంతా హైకమాండ్ వద్దే తాడోపేడో తేల్చుకోవాలని భావించారు. కానీ ప్రధాని షెడ్యూల్‌లో నేతలతో ఎలాంటి భేటీ లేకపోవడంతోనే వారు సభకు రాలేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా ఈనెల 3వ తేదీన నిజామాబాద్ సభలో అయినా మోడీని కలిసేందుకు వారికి అవకాశం దక్కుతుందో లేదో అనే చర్చ సాగుతోంది. ప్రధాని వారికి సమయం ఇస్తా రా? లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మోడీ వారిని కలిసేందుకు నిరాకరిస్తే ఈనెల 6వ తేదీన తెలంగాణకు వస్తున్న నడ్డాతో అయినా తమ సమస్యలు చెప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా విజయశాంతి ఇటీవల హైదరాబాద్ లో కాంగ్రెస్ నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమర్థించడమే కాకుండా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని మెచ్చుకుంది. పలుమార్లు బీజేపీని ఇరకాటంలో పెట్టేలా ట్వీట్లు కూడా చేసింది. ఇక రాజగోపాల్ రెడ్డి సైతం త్వరలో కాంగ్రెస్ గూటికి చేరుతారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన మర్రిగూడలో క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాను పార్టీ వీడుతున్నాననే ప్రచారం ఆరు నెలలుగా జరుగుతోందని, అయితే దీనిపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని మీడియాకు చెప్పడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి మోడీ పాలమూరు సభకు హాజరుకాని నేతల పరిస్థితి ఏంటనేది ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీరు ఏం చేయబోతున్నారనేది సస్పెన్స్ గా మారింది.



Next Story

Most Viewed