కమీషన్ల ఎమ్మెల్యేలపై చర్యలేవి కేసీఆర్: YS Sharmila

by Disha Web Desk 2 |
కమీషన్ల ఎమ్మెల్యేలపై చర్యలేవి కేసీఆర్: YS Sharmila
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘దళితబంధు, డబుల్​బెడ్రూంలో ఎమ్మెల్యేలు ఎవరేం చేస్తున్నారో తెలుసు, దళితబంధు ఇవ్వడానికి రూ. 3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అందరి చిట్టా నా దగ్గర ఉంది. తీరు మారకపోతే తోకలు కట్ చేస్తా’ అంటూ పార్టీ ప్రతినిధుల సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు ఆయుధాల్లా మారాయి. ఈ మేరకు కేసీఆర్ వ్యాఖ్యలపై శుక్రవారం ట్విట్టర్ వేదికగా వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. తప్పు చేస్తే బిడ్డైనా, కొడుకైనా వదిలిపెట్టేది లేదు, జైలుకు పంపుడేనన్న కేసీఆర్..ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని ఒప్పుకున్నారంటూ ఎద్దేవా చేశారు. దళిత బంధులో రూ.3 లక్షల లంచం తీసుకుంటున్నారని, వాళ్ల చిట్టా ఉందన్న కేసీఆర్ వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు.

వారిని ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించడం లేదని నిలదీశారు. ఎవరో అనామకుడు ఫిర్యాదు చేస్తే ఆలోచించకుండా మంత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కేసీఆర్...మరి ఆ అనామకుడికున్న విలువ నీకు లేదా? అని విమర్శించారు. తన దగ్గర చిట్టా ఉన్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ చర్యలు తీసుకుంటే లిక్కర్ స్కాంలో బిడ్డ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తారనే...ఎమ్మెల్యేల అవినీతిని కండ్లు తుడుచుకొని చేతకాని దద్దమ్మలా చూస్తున్నాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయినా బంగారు బతుకమ్మే బాలేనప్పుడు..ఇతరులను శిక్షించే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. ఇక ఈ అవినీతి పాలనలో మునిగి తేలిన ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చివాత పెట్టడం ఖాయం అంటూ షర్మిల హెచ్చరించారు.


Next Story

Most Viewed