బిగ్ బాస్ షో లో అశ్లీలత.. పోలీసులను ఆశ్రయించిన యువకులు

by Malleboina Mahesh |   (  Updated:2025-10-16 09:35:56  IST  )

టీవీ రియాలిటీ షో బిగ్ బాస్‌లో అశ్లీలత ఎక్కువైందని సమాజ బాధ్యత గల పౌరులుగా కమ్మరి శ్రీనివాస్, బగన్నగారి రవీందర్ రెడ్డి పోలీసులకు అధికారిక ఫిర్యాదు సమర్పించారు.

బిగ్ బాస్ షో లో అశ్లీలత.. పోలీసులను ఆశ్రయించిన యువకులు
X

దిశ, వెబ్ డెస్క్: టీవీ రియాలిటీ షో బిగ్ బాస్‌ (Big Boss)లో అశ్లీలత ఎక్కువైందని సమాజ బాధ్యత గల పౌరులుగా కమ్మరి శ్రీనివాస్, బగన్నగారి రవీందర్ రెడ్డి పోలీసులకు అధికారిక ఫిర్యాదు సమర్పించారు. స్టార్ మా ఛానల్, ఇతర OTT ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం అవుతున్న ఈ షోలో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన కంటెంట్‌ను “వినోదం” పేరుతో ప్రదర్శిస్తున్నారని వారు ఆరోపించారు. పాల్గొనేవారు దుర్భాషలు ఉపయోగించడం, అనైతిక ప్రవర్తన ప్రదర్శించడం, కుటుంబ, సామాజిక విలువలకు విరుద్ధంగా ప్రవర్తించడం వంటి అంశాలు యువతపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వారి ఫిర్యాదులో తెలిపారు.

ఈ షో వాగ్వాదాలు, వ్యక్తిగత దాడులు, అసభ్యత, దుర్వచనాలను ప్రోత్సహిస్తూ భారతీయ సంస్కృతీ విలువలను దెబ్బతీస్తోందని, కుటుంబ సభ్యులు కలిసి చూసే సమయాల్లో ఇలాంటి కంటెంట్ ప్రసారం చేయడం ప్రసార నైతికతలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఇలాంటి బిగ్ బాస్ కార్యక్రమం భారతీయ శిక్షాస్మృతి (IPC), సమాచార సాంకేతిక చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ, నిర్మాతలు, ప్రసారకర్తలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, ఈ సీజన్‌ను తక్షణమే నిలిపివేయాలని వారు పోలీసులను అధికారులను వారు కోరారు.

Next Story